కిలోమీటర్ల కొద్దీ రోగుల లైన్లు…3 నెలల్లో 60% మందికి సోకవచ్చు
ఆందోళన కలిగిస్తున్న అంచనాలు
చైనాలో కోవిడ్–19 విశ్వరూపం చూపిస్తోంది. ప్రజా నిరసనలకు తలొగ్గి ప్రభుత్వం
జీరో కోవిడ్ విధానాన్ని వెనక్కి తీసుకున్న దగ్గర్నుంచి కేసులు అమాంతం
పెరిగిపోయాయి. ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. మందులు దొరకడం లేదు. కరోనా
రోగులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని చికిత్స కోసం ఆస్పత్రుల దగ్గర
కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిల్చొంటున్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న
వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఆస్పత్రుల కారిడార్లలో, మార్చురీలలో శవాలు
వరసగా పెట్టి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
శ్మశాన వాటికల్లో రోజూ వందలాది మృతదేహాలు వస్తున్నాయి. రోజుకి దాదాపుగా 40 వేల
మందికి కరోనా సోకుతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పైగా
చలికాలం ముగిసేలోగా కనీసం మూడు వేవ్‌లు దేశాన్ని అతలాకుతలం చేస్తాయంటూ
వెలువడుతున్న అంచనాలు ఆందోళనను మరింత పెంచుతున్నాయి.
ఇంతటి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం కేసుల
సంఖ్యని తక్కువ చేసి చూపిస్తోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నా మంగళవారం కేవలం
ఐదుగురే ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించింది. కోవిడ్‌తో శ్వాసకోశ
సమస్యలతో చనిపోతేనే కరోనా మరణాలుగా లెక్కిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం
ఒమిక్రాన్‌లో త్వరితంగా వ్యాప్తి చెందే బిఏ.5.2, బిఎఫ్.7 సబ్ వేరియంట్లు
విస్తరిస్తున్నాయి. రోగుల తాకిడిని ఎదుర్కోవడానికి బీజింగ్, షాంఘై, చెంగ్డు,
వెన్ఝూ సహా పలు నగరాల్లో వందల పడకలున్న తాత్కాలిక ఆస్పత్రులు, వందలాది ఫీవర్
క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఎక్కువ గంటలు పని చేయాలని
ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
రాబోయేవి గడ్డు రోజులు : చైనాలో ఇక మీద గడ్డు రోజులు ఎదుర్కోబోతోందని పలు
నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే మూడు నెలల్లో చైనా జనాభాలో 60శాతానికి
పైగా కరోనా బారిన పడతారని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంతర్జాతీయ వ్యాధి
నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ అంచనా వేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని
వచ్చే ఏడాది చైనాలో రోజుకి లక్ష కేసులు నమోదవుతాయని, 20 లక్షల మంది
మరణిస్తారని పలు నివేదికలు హెచ్చరించాయి. వృద్ధుల్లో వ్యాక్సిన్ ఇవ్వడంలో
చూపించిన నిర్లక్ష్యానికి చైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని నిపుణులు
అంటున్నాయి. కరోనాలో అత్యంత కీలకమైన ఆర్ వాల్యూ (ఒక వ్యక్తి నుంచి వైరస్
ఎంతమందికి సంక్రమిస్తుందో చెప్పే విధానం) 16గా ఉండడం ప్రమాద ఘంటికలు
మోగిస్తోంది. అంటే ఒక వ్యక్తి ద్వారా వైరస్ 16 మందికి సోకుతుందన్న మాట.
2019లో వూహాన్లో కరోనా బట్టబయలయ్యాక ఇంతటి ఘోరమైన పరిస్థితులు నెలకొనడం ఇదే
తొలిసారి. జిన్‌పింగ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కరోనాతో ఈ మూడేళ్లలో
3.80 లక్షల కేసులు నమోదైతే, 5,242 మంది ప్రాణాలు కోల్పోయారు. వరల్డ్ డేటా
మాత్రం ఇప్పటివరకు 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని, గత 24 గంటల్లో
40వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెబుతోంది.