కొనసాగుతున్న రష్యా దాడులు
కీవ్ : ముమ్మరంగా పోరు సాగుతున్న బఖ్ముత్ నగరంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు
వొలొదిమిర్ జెలెన్స్కీ ఆకస్మికంగా క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు.
సైనిక బలగాల్లో స్థైర్యాన్ని నింపేరీతిలో వారితో ముచ్చటించారు. డాన్బాస్
ప్రాంతం మొత్తాన్ని గుప్పిటపట్టాలన్న రష్యా ప్రయత్నాలు వమ్ముచేస్తూ
బఖ్ముత్ను మాత్రం ఉక్రెయిన్ నిలబెట్టుకుంటూ వస్తోంది. తమ భూభాగాన్ని
వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాటేందుకు ఈ నగరం ఒక ఉదాహరణ అని టెలిగ్రామ్
ఛానల్లో జెలెన్స్కీ పేర్కొన్నారు. కీవ్‌లో 10 నెలల విరామం తర్వాత రెండు
ప్రధాన సబ్వే స్టేషన్లను పునఃప్రారంభించారు. ఉక్రెయిన్‌లోని ఆగ్నేయ
ప్రాంతాలపై రష్యా బలగాలు దాడులు జరిపాయి. దీనిలో కనీసం ఐదుగురు సాధారణ పౌరులు
ప్రాణాలు కోల్పోయారు. ఆహారం, మందులు, వేడిమినిచ్చే సదుపాయాలు లేకుండా ప్రజలు
బేస్మెంట్లలో తలదాచుకోవాల్సి వస్తోందని దొనెట్స్క్ గవర్నర్ తెలిపారు.
పశ్చిమ రష్యాలోని చువాషియా ప్రాంతంలో గ్యాస్ సరఫరా పైపులైనులో పేలుడు చోటు
చేసుకుంది. దీనిలో ముగ్గురు మృతి చెందారు. ఉక్రెయిన్‌లో తమ బలగాలు
ధైర్యసాహసాలతో సేవలందిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనియాడారు.
క్రెమ్లిన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని నాలుగు
ప్రాంతాలకు తాము నియమించిన అధిపతులకు ఆయన అవార్డులు అందజేశారు.
ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదు : ఐరాస
ఐక్యరాజ్యసమితి : ఉక్రెయిన్‌లో యుద్దం చాలాకాలం కొనసాగవచ్చనీ, సమీప
భవిష్యత్తులో శాంతి చర్చలు జరిగే అవకాశం లేదని ఐక్యరాజ్యసమితి ప్రధాన
కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ న్యూయార్క్‌లో వెల్లడించారు. ఆహార ధాన్యాలు,
ఎరువుల ఎగుమతిని పెంచడంపైనా, యుద్ధ ఖైదీల మార్పిడిపైనా ప్రస్తుతం దృష్టి
పెడుతున్నామన్నారు. బహుశా 2023లో యుద్ధం ముగుస్తుందని ఆశిస్తున్నానని
చెప్పారు. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని విస్తరించే అంశాన్ని తీవ్రంగా
పరిశీలిస్తున్నామనీ, మండలిలో వీటో హక్కుపై పరిమితి విధించడం సాధ్యమవుతుందని
తాను అనుకోవడం లేదని ఆయన వివరించారు.