మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక కేంద్రంపై
కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది మరణించగా మరో 8 మంది గాయపడ్డారు.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని బటాంగ్ కలి వద్ద
కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి
గాయాలయ్యాయి. 17 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. సేంద్రీయ
వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక శిబిరంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ
సమయంలో అక్కడ 94 మంది మలేసియన్లు ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిలో 59 మందిని
సహాయక బృందాలు కాపాడాయి. ఘటనా స్థలి వద్ద 400 మంది సిబ్బంది, జాగిలాలు సహాయక
చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 3 గంటలలోపు ఈ
ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఉన్న భాగం నుంచి కొండచరియలు వ్యవసాయ క్షేత్రంలోకి
కూలినట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడినప్పుడు పెద్ద శబ్ధం వచ్చిందని
ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. ఆ ప్రాంతంలో కొన్ని రోజులుగా భారీ
వర్షాలు కూడా పడలేదు. ఓ మోస్తరు వర్షమే కురిసింది. గెంటింగ్ హైలాండ్స్ హిల్
రిసార్ట్‌కు సమీపంలో ఈ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడే టెంటులు
వేసుకుని పర్యటకులు బస చేశారు. ఇది మలేసియాలో ప్రముఖ పర్యటక ప్రాంతంగా
పేరుగాంచింది. మృతులంతా మలేసియా వాసులేనని అధికారులు ప్రకటించారు.