బీజింగ్ : కరోనా విషయంలో చైనా ప్రభుత్వం చేతులెత్తేసింది. రోజుకు ఎన్ని కొత్త
కేసులు వెలుగు చూస్తున్నాయో ట్రాక్ చేయడం అసాధ్యమని ఆ దేశ ఆరోగ్య శాఖ
తేల్చిచెప్పింది. దీంతో గత నెలలో అత్యధిక కేసులు నమోదైన చైనాలో ఇప్పుడు
ఎంతమంది వైరస్ బారినపడుతున్నారో తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కరోనా కఠిన
ఆంక్షలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో జీరో కోవిడ్
పాలసీని చైనా ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. క్వారంటైన్, కాంటాక్ట్
ట్రేసింగ్, టెస్టుల విషయంలో నిబంధనలను సడలించింది. ఫలితంగా కరోనా కేసులను
ట్రాక్ చేయడం అసాధ్యమైంది. సడలించిన నిబంధనలతో వైరస్ సోకి లక్షణాలు లేనివారు
యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. వీరంతా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు కూడా
చేయించుకోవడం లేదు. కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటి సంఖ్యను
కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో కరోనా కేసులను ఇక ట్రాక్ చేయలేమని చైనా
ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. చైనాలో కరోనా వ్యాప్తి మొదలై మూడు సంవత్సరాలు
కావస్తున్నా వైరస్ను పూర్తిగా కట్టడి చేయడంలో ఆ దేశం విఫలమవుతోంది. టీకాలు
పంపిణీ చేసినప్పటికీ అవి అంతంత మాత్రమే ప్రభావం చూపుతున్నాయి. పైగా ఇంకా
కొన్ని లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో కొత్త కేసులు
విపరీతంగా పెరగడం డ్రాగన్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.