భారత్, చైనా సరిహద్దులో మరోసారి సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఇరు
దేశాల సైనికులకు స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. భారత్- చైనా సరిహద్దులో
మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్
సెక్టార్ వద్ద ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ
వద్ద ఈ నెల 9న ఘర్షణ జరగ్గా ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప
గాయాలైనట్లు తెలుస్తోంది. ఎల్ఏసీ సమీపంలోకి చైనా సైనికులు వచ్చిన నేపథ్యంలో ఈ
ఘర్షణ నెలకొన్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ
తర్వాత ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అక్కడ శాంతి, సామరస్య
వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టిన ఇరు దేశాల సైనికాధికారులు
అక్కడ ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాలు
అక్కడి నుంచి తమ బలగాల్ని వెనక్కి రప్పించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత
సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటనలో 40 మంది చైనా
సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. దీంతో సరిహద్దులో
పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అనంతరం రెండు దేశాలు సైనికాధికారులు
పలు దఫాలు చర్చలు జరిపారు. వీటి ఫలితంగా ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల నుంచి
ఇరు దేశాల సైనికులను వెనక్కి రప్పించాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటువంటి
ఘటన చోటు చేసుకోవడంతో సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.