వాషింగ్టన్ : అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ షాకింగ్ విషయాన్ని
వెల్లడించింది. భారత్తో సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అగ్రరాజ్యం
అధికారులను చైనా హెచ్చరించిందని యూఎస్ కాంగ్రెస్కు నివేదిక సమర్పించింది. ఈ
రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం సమయంలో ఇది జరిగినట్లు పేర్కొంది.
వాస్తవాధీన రేఖ విషయంలో భారత్తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు సరిహద్దు
గొడవల ప్రభావం ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై ఏమాత్రం పడకుండా చైనా
జాగ్రత్తపడిందని పెంటగాన్ నివేదిక స్పష్టం చేసింది. అలాగే ఆ సమయంలో భారత్కు
అమెరికా మరింత దగ్గర కాకుండా చేయాలనుకున్నట్లు పేర్కొంది. అందుకే అగ్రరాజ్యం
అధికారులకు చైనా వార్నింగ్ కూడా ఇచ్చిందని నివేదిక స్పష్టం చేసింది. సరిహద్దు
వివాద సమయంలో 2021 మొత్తం చైనా బలగాలను మోహరిస్తూనే ఉందని, మౌలిక సుదుపాయాల
కోసం భారీఎత్తున నిర్మాణాలు చేపట్టిందని నివేదిక వెల్లడించింది. ఇరు దేశాలు
వెనక్కి తగ్గకపోవడంతో ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేదని
తెలిపింది. తమ సరిహద్దులో భారత్ నిర్మాణాలు చేపడుతోందని చైనా, తమ భూభాగంలోకి
చైనా వస్తోందని భారత్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయని పెంటగాన్ నివేదిక
పేర్కొంది. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య భీకర ఘర్షణ
చెలరేగింది. గత 46 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇదే అతిపెద్ద హింసాత్మక ఘటన. ఈ
గొడవలో రెండు దేశాలకు చెందిన సైనికులు చనిపోయారు. ఆ తర్వాత ఉద్రిక్తతలు తీవ్ర
స్థాయికి చేరాయి.