ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ
ఒప్పందాన్ని తాము విరమించుకున్నట్లు నిషేధిత తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్
ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడాలంటూ తమ
ఫైటర్లకు ఆదేశించినట్లు వెల్లడించింది. పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో
ముజాహిదీన్లకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఈ
నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాయుధ పోరాటం ద్వారా పాకిస్థాన్‌లో
అధికారంలోకి రావాలని భావిస్తోన్న ఈ సంస్థ వరుస దాడులతో ఆ దేశానికి కంటిమీద
కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్‌లో పాక్ ప్రభుత్వానికి,
టీటీపీకి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, దీన్ని ఉల్లంఘించారంటూ
ఇరుపక్షాలు పలు సందర్భాల్లో పరస్పరం ఆరోపించుకున్నాయి. ‘తెహ్రీక్ ఏ తాలిబన్’
వివిధ ఇస్లామిస్ట్ సాయుధ మిలిటెంట్ల కూటమి. దీన్ని పాకిస్థాన్ తాలిబన్‌గా
అభివర్ణిస్తారు. పాక్ సైన్యానికి వ్యతిరేకంగా 2007లో బైతుల్లా మెహసూద్
దీన్ని స్థాపించాడు. అఫ్గాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లది, టీటీపీది ఒకటే
భావజాలం! అల్ఖైదాతోనూ సంబంధాలు ఉన్నాయి. టీటీపీ సభ్యులు అఫ్గానిస్థాన్
సరిహద్దుల్లో దాక్కుని పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంటారు.
ఇప్పటివరకు పాకిస్థాన్‌లో పదుల కొద్దీ హింసాత్మక దాడులకు పాల్పడి, వందలాది
ప్రాణాలను బలిగొన్నారు. ముఖ్యంగా పాక్ సైనిక శిబిరాలు, చెక్‌పోస్ట్‌లపై
మెరుపు దాడులు చేసి, పెద్దసంఖ్యలో సైనికులను హతమార్చారు. పాక్‌లోని
చైనీయులపైనా దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.