ట్విటర్ చీఫ్ ఎలాన్ మస్క్ తాజాగా మరో కీలక ట్వీట్ చేశారు. ఒకవేళ గూగుల్,
యాపిల్లు తమ యాప్ స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలగిస్తే.. ప్రత్యామ్నాయ
స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తానని తెలిపారు. ట్విటర్ చీఫ్ ఎలాన్ మస్క్ మరో
ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు. ఒకవేళ గూగుల్, యాపిల్ కంపెనీలు తమ యాప్
స్టోర్ ల నుంచి ట్విటర్‌ను తొలగిస్తే.. ప్రత్యామ్నాయంగా తానే స్మార్ట్‌ఫోన్
తీసుకొస్తానని తెలిపారు. యాపిల్, గూగుల్ల మార్గదర్శకాలను పాటించడంలో
విఫలమైతే వాటి యాప్ స్టోర్ల నుంచి ట్విటర్ ను తొలగించే అవకాశం ఉందని
ట్విటర్ ట్రస్ట్, సేఫ్టీ విభాగం మాజీ అధిపతి యేల్ రోత్ ఇటీవల
వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మస్క్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్,
యాపిల్‌కు చెందిన ఐఓఎస్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.
‘ఒకవేళ యాపిల్, గూగుల్‌లు తమ అప్లికేషన్ స్టోర్ల నుంచి ట్విటర్‌ను
తొలగిస్తే.. మస్క్ తన సొంత స్మార్ట్‌ఫోన్ తీసుకురావాలి. పక్షపాత వైఖరి,
గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడే ఐఫోన్, ఆండ్రాయిడ్లను సగం అమెరికా
వదిలేస్తుంది. పైగా అంగారకుడిపై వెళ్లేందుకు రాకెట్లు నిర్మించే మనిషికి
చిన్నపాటి స్మార్ట్ఫోన్లను తయారు చేయడం సులభమే!’ అని ఓ వినియోగదారు ట్వీట్
చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘ఇటువంటి పరిస్థితి రాదని
ఆశిస్తున్నా. కానీ, ఇదే జరిగి, వేరే అవకాశం లేకపోతే మాత్రం.. ప్రత్యామ్నాయ
ఫోన్ తయారు చేస్తా’ అని చెప్పారు.
ఈ రిప్లయ్ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ఆయనకు
మద్దతుగా నిలుస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. స్మార్ట్ఫోన్లలో మస్క్
విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారని ఓ వినియోగదారు స్పందించారు. తనకు తెలిసి ఈ
ప్లాన్ ఇప్పటికే అమల్లో ఉన్నట్లు భావిస్తున్నానని మరొకరు కామెంట్ చేశారు.
ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ పగ్గాలు చేపట్టాక ట్విటర్లో ఎప్పటికప్పుడు
పరిణామాలు మారిపోతున్న విషయం తెలిసిందే. భారీఎత్తున ఉద్యోగుల తొలగింపు,
వెరిఫైడ్ ఖాతాలకు బ్లూటిక్‌ల కేటాయింపులో గందరగోళం తదితర అంశాలతో ఈ సంస్థ
రోజూ వార్తల్లో నిలుస్తోంది.