పాస్‌పోర్టుపై పూర్తి పేరు లేకుండా ఒకే పదంతో పేరు ఉంటే వారిని అనుమతించబోమని
యూఈఏ వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నిబంధనల్లో యునైటెడ్ అరబ్
ఎమిరేట్స్ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పాస్‌పోర్టుపై పూర్తి పేరు
లేకుండా కేవలం ఒక పదంతో మాత్రమే పేరు ఉండేవారిని తమ దేశంలోకి అనుమతించబోమని
అన్ని విమానయాన సంస్థలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కొత్త నిబంధన నవంబరు 21
నుంచే అమల్లోకి వచ్చిందట. దీనిపై తాజాగా ఎయిరిండియా, ఇండిగో వంటి భారత
ఎయిర్లైన్లు ప్రయాణికులకు సమాచారమిచ్చాయి. యూఈఏ అధికారుల సూచనల ప్రకారం
టూరిస్టు లేదా ఇతర రకాల వీసాదారులైనా పాస్‌పోర్టుపై పూర్తి పేరు లేకుండా ఒకే
పదంతో పేరు ఉంటే వారిని యూఏఈలోకి అనుమతించట్లేదు’’ అని భారత ఎయిర్లైన్లు
వేర్వేర్లు ప్రకటనల్లో వెల్లడించాయి.
పాస్‌పోర్టుపై ఒకే పదంతో పేరు ఉండే వారికి యూఏఈ వీసాలు జారీ చేయట్లేదు. ఒకవేళ
అలాంటి పాస్‌పోర్టుదారులకు ఇప్పటికే వీసా జారీచేసినప్పటికీ.. అరబ్ దేశ
ఇమ్మిగ్రేషన్ విభాగం అనుమతించట్లేదని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఈ
కొత్త నిబంధన విజిట్ వీసా, వీసా ఆన్ అరైవల్, ఉపాధి వీసా, తాత్కాలిక
వీసాదారులకు వర్తిస్తుందట. యూఏఈలో శాశ్వత లేదా నివాస హోదా ఉన్న వారికి ఈ
నిబంధన వర్తించదని ఎయిర్లైన్లు వెల్లడించాయి. శాశ్వత/నివాస హోదా ఉన్నవారికి
పాస్‌పోర్టుపై ఒకే పదంతో పేరు ఉంటే.. అదే పేరును “ఫస్ట్ నేమ్ ” లేదా “సర్ నేమ్
’ కాలమ్‌లో అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నిబంధన గురించి పలు
భారత ఎయిర్లైన్లు ఇప్పటికే ప్రయాణికులకు సమాచారమిచ్చాయి. అయితే దీనిపై యూఏఈ
రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.