సహోద్యోగులపై వాల్ మార్ట్ మేనేజర్ కాల్పులు
ఆపై అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల కలకలం రేగింది. రాష్ట్రంలోని చీసాపీక్ లో
వాల్ మార్ట్ మేనేజర్ సహోద్యోగులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆ స్టోర్ లో
పనిచేస్తున్న 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికా
కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. వెంటనే స్పందించిన
పోలీసులు వాల్ మార్ట్ కు చేరుకునే లోపే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కాల్పుల్లో గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు చీసాపీక్
పోలీసులు తెలిపారు.
కాల్పులకు కారణమేంటని కానీ, ఎంతమంది చనిపోయారని కానీ ఇప్పుడే వెల్లడించలేమని
పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడిపై కాల్పులు జరిపి పోలీసులే
మట్టుబెట్టారన్న వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. తాము అక్కడికి చేరుకునే
లోపే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరించారు. కాల్పుల నేపథ్యంలో
చీసాపీక్ లోని సామ్ సర్కిల్ లో ఉన్న వాల్మార్ట్ దగ్గర భయానక వాతావరణం
నెలకొంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేందుకు పెద్ద సంఖ్యలో అంబులెన్స్
లు అక్కడికి చేరుకున్నాయి.కాల్పుల ఘటన జరిగిన సమయంలో వాల్మార్ట్ తెరిచే
ఉందని యూఎస్ పోలీసులు తెలిపారు. వాల్మార్ట్ స్టోర్ దగ్గరకు భారీ సంఖ్యలో
చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో 16
మందికి గాయాలయ్యాయని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని
పోలీసులు చెప్పారు.