అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపించిన అర్టెమిస్ మిషన్ 1 మానవరహిత ‘ఓరియన్
కాప్య్సూల్’ చంద్రుడిని చేరుకుంది. అందులోని కెమెరాలు కొన్ని చిత్రాలను తీసి
భూమికి పంపించాయి. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు సన్నాహాకంగా.. అమెరికా
అంతరిక్ష సంస్థ నాసా పంపిన అర్టెమిస్ మిషన్ 1 మానవరహిత ‘ఓరియన్ కాప్య్సూల్’
చంద్రుడిని చేరుకుంది. చంద్రుడి వెనకవైపు కక్ష్యలో 80 మైళ్ల దూరానికి చేరింది.
సిబ్బంది కాప్య్సూల్, మూడు డమ్మీలు చంద్రుడి వెనకవైపునకు దూరంగా వెళ్లాయి.
ఐతే కక్ష్యలోకి ప్రవేశించినపుడు అరగంట సమయం సమాచారం నిలిచిపోయింది. ఈ
నేపథ్యంలో చంద్రుడి ముందు భాగానికి కాప్య్సూల్ తిరిగి వచ్చేవరకూ.. ఇంజన్
ఫైరింగ్ సరిగా ఉందో లేదో హూస్టన్‌లోని కంట్రోల్ కేంద్రానికి తెలియలేదు.
చంద్రుడి వెనక నుంచి ఒరాయన్ బయటకు వచ్చిన తర్వాత అందులో ఉన్న కెమెరాలు భూమికి
చిత్రాలను పంపినట్లు ఫ్లైట్ డైరెక్టర్ జెబ్ స్కోవిల్లె తెలిపారు. అందులో
నీలి చుక్క చుట్టూ చీకటిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంజన్లో అన్ని సక్రమంగా
ఉంటే శుక్రవారం మరోసారి.. ఇంజన్‌ను మండిస్తామని చెప్పారు. వచ్చే వారాంతంలో
ఓరియన్ భూమికి నాలుగు లక్షల కిలోమీటర్ల దూరం చేరుకుని 1970లో అపోలో 13
నెలకొల్పిన రికార్డును బద్దలు కొడుతుందని వివరించారు. ఆ తర్వాత చంద్రుడి
కక్ష్యలోనే వారం రోజులు తిరగనున్న ఓరియన్.. తర్వాత భూమికి చేరుతుంది. డిసెంబరు
11న పసిఫిక్ సముద్రంలో ఓరియన్ను దించేందుకు ప్రయత్నించనున్నారు. మరో ప్రయోగం
తర్వాత చంద్రుడిపైకి వ్యోమగాములను నాసా దించనుంది.