ఒకప్పుడు సైకిళ్లపై రాకెట్ విడి భాగాలను తీసుకెళ్లిన ఇస్రో ఇవాళ ప్రపంచమే
ఆశ్చర్య పోయేలా ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించ బోతోంది. దీని
వల్ల రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసినట్లవుతుంది. హైదరాబాద్ లోని
స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సొంతంగా విక్రమ్-ఎస్ రాకెట్ తయారుచేసింది. దాన్ని
శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
– షార్ నుంచి నేటి ఉదయం 11:30 గంటలకు నింగిలోకి పంపబోతోంది. ప్రైవేట్ రంగంలో
ఇది మొదటి ప్రయోగం కాబట్టి దీన్ని ప్రారంభ్ మిషన్ అని పిలుస్తున్నారు.
దీన్ని విజయవంతం చేయడం ద్వారా ఇస్రో చరిత్రలో మరో అద్భుత ఘట్టాన్ని
ఆవిష్కరించినట్లు అవుతుంది.
రాకెట్ ప్రయోగ విశేషాలు : భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయికి
నివాళిగా రాకెట్‌కు విక్రమ్-S’ అని పేరుపెట్టారు. ఇది 545 కేజీల బరువు
ఉంటుంది. అంటే దాదాపు 3 బైకులతో సమానం. రాకెట్ పొడవు 6 మీటర్లు. ఇది నింగిలో
81.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తుంది. తర్వాత యూటర్న్ తీసుకొని..
శ్రీహరికోటకు 115 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడిపోతుంది. ఈ రాకెట్ ద్వారా 3
శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతారు. వాటిలో ఒకటి చెన్నైలోని ఏరోస్పేస్
స్టార్టప్ స్పేస్‌కిడ్స్ తయారుచేసిన 2.5 కేజీల శాటిలైట్ ఫన్-శాట్ కాగా
మిగతా రెండూ విదేశీ శాటిలైట్లు. ఈ రాకెట్ ప్రయోగానికి ప్రస్తుతం వాతావరణం
అత్యంత అనుకూలంగా ఉంది.