అమెరికా : మస్క్ అనాలోచితంగా తీసుకొన్న నిర్ణయం బడాకంపెనీలకు శాపంగా మారింది.
ఇప్పటికే అమెరికాలోని పలు పెద్దకంపెనీలు బిలియన్ల డాలర్లు నష్టపోయాయి.
ట్విటర్ బ్లూటిక్ కోసం ఆత్రంగా 8 డాలర్లు వసూలు చేయడం, ఓ కంపెనీ సంపద 15
బిలియన్ డాలర్లు (రూ.1.20లక్షల కోట్లు) ఆవిరి కావడానికి కారణమైంది. టెక్
దిగ్గజంగా పేరు తెచ్చుకున్న మస్క్ నిర్ణయాలు ప్రపంచంలో గందరగోళం
సృష్టిస్తున్నాయి. ఆయన ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించిన నాటి నుంచి
ఇది కొనసాగుతోంది. ఫార్మా రంగానికి చెందిన ఓ దిగ్గజ సంస్థకు ట్విటర్ నిర్ణయం
చేదు అనుభవాన్ని మిగిల్చింది. అమెరికాలో ‘ఎలీ లిల్లీ అండ్ కంపెనీ’ మధుమేహం
బాధితులకు ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఈ కంపెనీదిగా పేర్కొంటున్న బ్లూటిక్
ఖాతా ట్విటర్లో ప్రత్యక్షమైంది. ఇన్సులిన్‌ను ఉచితంగా ఇస్తున్నామని
ప్రకటించినందుకు సంతోషిస్తున్నామని ట్వీట్ చేసింది.
1876లో ప్రారంభించిన ‘ఎలీ లిల్లీ’ ఓ ప్రైవేటు రంగ సంస్థ. స్టాక్ మార్కెట్లో
నమోదైంది. దీంతో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను విక్రయించడం మొదలుపెట్టారు. ఈ
తప్పుడు బ్లూటిక్ ఖాతా చేసిన ట్వీట్ కారణంగా ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా
4.37 శాతం పతనం అయ్యాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువలో 15 బిలియన్
డాలర్లు ఆవిరైపోయింది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1.20 లక్షల
కోట్లన్నమాట. విషయం తెలుసుకున్న ‘ఎలీ లిల్లీ’ వెంటనే తన అధికారిక ట్విటర్
ఖాతాలో వివరణ ఇచ్చుకొంది. గతంలో ప్రచారమైన ట్వీట్ ఓ నకిలీ ఖాతాదని
వెల్లడించింది. అప్పటికే ఈ సంస్థ షేరు 368 డాలర్ల నుంచి 345 డాలర్లకు
పడిపోయింది. ప్రముఖ ఆయుధ తయారీ సంస్థ ‘లాక్హిడ్ మార్టిన్’కు కూడా ట్విటర్
బ్లూటిక్ సెగ తాకింది. ఈ సంస్థ పేరిట ట్విటర్ బ్లూటిక్ ఖాతా
పుట్టుకొచ్చింది. ‘‘ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, అమెరికా దేశాల మానవహక్కుల
ఉల్లంఘనలపై దర్యాప్తు ముగిసే వరకు ఆయుధాలు విక్రయించం’’ అన్న ట్వీట్
ప్రత్యక్షమైంది. లాక్హిడ్ మార్టిన్‌కు ఈ దేశాలు పెద్ద కస్టమర్లు. దీంతో
వీటికి ఆయుధ విక్రయాలు ఆపితే సంస్థ నష్టపోవడం ఖాయమని భావించిన ఇన్వెస్టర్లు
షేర్లను విక్రయించడం మొదలు పెట్టారు. ఫలితంగా ఈ కంపెనీ షేర్ ధర 5.5శాతం పతనం
కావడంతో భారీగా మార్కెట్ విలువ ఆవిరైంది.