లండన్ : ఉత్తర ఇంగ్లాండ్‌లో పర్యటించిన బ్రిటన్ రాజు ఛార్లెస్-3 దంపతులకు
ఊహించని పరిణామం ఎదురయ్యింది. రాజు కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ
నిరసనకారుడు వారిపై గుడ్లను విసరడం కలకలం రేపింది. బ్రిటన్ రాజు ఛార్లెస్-3
దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో
పాల్గొన్న ఛార్లెస్ దంపతులపై ఓ వ్యక్తి గుడ్లతో దాడి చేశాడు. వెంటనే
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే,
పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసే రాజు ఛార్లెస్-3 ఈసారి మాత్రం తదేకంగా
చూస్తూ ఉండిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని
యార్క్ నగరంలో జరిగిన ఓ సంప్రదాయ వేడుకలో రాజు ఛార్లెస్-3, సతీమణి
కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేడుకకు హాజరైన పౌరులతో కరచాలనం చేస్తూ వారిని పలుకరిస్తూ ముందుకు
సాగారు. అదే సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు
చేస్తూ ఛార్లెస్‌పై గుడ్లు విసిరాడు. ఊహించని పరిణామంతో దంపతులిద్దరూ
కొద్దిసేపు అక్కడే నిలబడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారుడిని
అదుపులోకి తీసుకున్నారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ను పాలించిన క్వీన్
ఎలిజిబెత్-2 ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం
బ్రిటన్ నూతన రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. రాజు హోదాలో పలు
కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఛార్లెస్‌కు ఇంగ్లాండ్‌లో ఇలా ఊహించని అనుభవం
ఎదురైంది.