ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి ప్రతిపాదనకు స్పందన
అమెరికా : రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని
ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని అమెరికా అధికారులు కోరినట్లు సమాచారం. చర్చలకు
మార్గాలు మూసివేస్తే మిత్రపక్షాలు అలిసిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
వాషింగ్టన్ పోస్టు పత్రిక ఈ మేరకు వాషింగ్టన్‌లోని అధికారులను ఉటంకిస్తూ కథనం
ప్రచురించింది. రష్యాతో చర్చలపై ఉక్రెయిన్ వైఖరి, ఆర్థిక నష్టాల భయాలతో
మిత్రపక్షాలు కొంత అలసిపోయి ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి ఈ ప్రతిపాదనకు స్పందన
లభించింది. క్రిమియా సహా రష్యా ఆక్రమించుకొన్న భూభాగాల నుంచి మాస్కో దళాలు
వైదొలగితేనే చర్చలకు కీవ్ సిద్ధపడుతుందని తేల్చిచెప్పారు. దీంతోపాటు
ఉక్రెయిన్ గడ్డపై నేరాలకు పాల్పడిన రష్యన్లను కూడా శిక్షించాలని డిమాండ్
చేశారు. అంతేకాదు ప్రస్తుత రష్యా అధ్యక్షుడితో తాను చర్చలు జరపనని తెగేసి
చెప్పారు. పుతిన్ వారసుడితోనే తాను చర్చిస్తానని జెలెన్స్కీ గత నెలలో
ప్రకటించారు.
ఇప్పటికే అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు 18.9 బిలియన్ డాలర్ల విలువైన సాయం
అందింది. భవిష్యత్తులో కూడా మరింత సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది.
కానీ, ఐరోపా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాతోని మిత్ర దేశాలు ఈ యుద్ధ కారణంగా
ఇంధనం, ఆహారం ధరలతో పెరిగిన భారంతో ఇబ్బంది పడుతున్నాయి. మా భాగస్వాములు
ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యల్లో ఉక్రెయిన్ యుద్ధ అలసట ముఖ్యమైందని అమెరికా
అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించేందుకు
జెలెన్స్కీ ప్రతినిధి నిరాకరించారు. మరోవైపు అమెరికా ఎన్ఎస్ఏ జాక్
సులెవాన్ మాట్లాడుతూ శాంతి నెలకొల్పడం కోసం ఉక్రెయిన్‌కు తాము సహకరిస్తామని
చెప్పారు.