మరో 4 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం
రంగంలోకి యూఎస్ సూపర్సోనిక్ బాంబర్లు
సియోల్ : అగ్రరాజ్యాల నడుమ ఉన్న కొరియన్ సముద్ర జలాల్లో వేడి రాజుకుంటోంది.
ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బల ప్రదర్శనలో భాగంగా శనివారం మరో నాలుగు
బాలిస్టిక్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించింది. ఇటు దక్షిణ కొరియాకు
దన్నుగా నిలిచిన అమెరికా నుంచి రెండు సూపర్సోనిక్ బాంబర్లు సియోల్‌కు
చేరాయి. అటూ, ఇటూ రెండువైపులా సైనికశక్తి ప్రదర్శనలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు
పెరుగుతున్నాయి. 130 కిలోమీటర్ల మేర స్వల్ప లక్ష్యాలను ఛేదించగల నాలుగు
క్షిపణులను పశ్చిమతీరం నుంచి మధ్యాహ్న సమయంలో ప్రయోగించినట్లు ఉత్తర కొరియా
అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఈ వారం రోజుల్లో వీరు ప్రయోగించిన క్షిపణుల
సంఖ్య 30 దాటింది. ఇందులో ఉత్తర జపాన్ ప్రాంతాన్ని కలవరపెట్టిన గురువారం నాటి
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కూడా ఉంది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా
జరుపుతున్న భారీ వైమానిక విన్యాసాలతో ఆగ్రహంగా ఉన్న ఉత్తర కొరియా తన భూభాగంపై
పలు యుద్ధ విమానాల చక్కర్లతో ప్రతిస్పందనను తెలియజేసింది. శనివారంతో ముగిసిన
యూఎస్ – దక్షిణ కొరియా సంయుక్త వైమానిక విన్యాసాల్లో మొత్తం 240 యుద్ధ
విమానాలు ప్రదర్శించారు. ఇందులో ఆధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలు సైతం
ఉన్నాయి. దక్షిణ కొరియా సైన్యం ఈ విన్యాసాలను ధ్రువీకరించింది.
రంగంలోకి యూఎస్ సూపర్సోనిక్ బాంబర్లు : వరుస క్షిపణి పరీక్షలతో ఉద్రిక్తతలు
పెంచుతున్న ఉత్తరకొరియాకు అమెరికా హెచ్చరికలు పంపింది. దక్షిణకొరియాలో
జరుపుతున్న సంయుక్త సైనిక విన్యాసాల చివరి రోజు శనివారం అధునాతన సూపర్సోనిక్
బాంబర్ బీ–1బీ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. 2017 డిసెంబర్ తర్వాత
వీటిని విమానాలను కొరియా ద్వీపకల్ప విన్యాసాల్లో వాడటం ఇదే తొలిసారి. వారం
వ్యవధిలో ఉత్తర కొరియా పరీక్షల పేరిట ఏకంగా 30కి పైగా క్షిపణులు ప్రయోగించడంతో
దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అందుకే ఈసారి
విన్యాసాల్లో ఎఫ్–35 అగ్రశ్రేణి యుద్ధవిమానంసహా దాదాపు 240 యుద్ధ విమానాలతో
తమ సత్తా ఏమిటో ఉ.కొరియాకు చూపే ప్రయత్నంచేశాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అగ్రదేశాల మధ్య బేధాభిప్రాయలు పొడచూపడంతో ఇదే
అదనుగా భావించి ఉ.కొరియా క్షిపణి పరీక్షలను ఒక్కసారిగా పెంచేసింది. శనివారం
సైతం నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. విన్యాసాల పేరిట తమ
భూభాగాల దురాక్రమణకు ప్రయత్నిస్తే శక్తివంతమైన సమాధానం ఇస్తామని అమెరికా,
దక్షిణ కొరియాలనుద్దేశిస్తూ ఉత్తర కొరియా హెచ్చరించడం గమనార్హం.