కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ పార్టీ అధికారం చేపడితే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా కంగ్రా జిల్లాలో జరిగిన సభలో ఆమె ఈ కీలకప్రకటన చేశారు. తాము వాగ్దానం చేస్తే, కచ్చితంగా దానిని నెరవేర్చుతామని చెప్పారు. ఛత్తీస్గఢ్లో రైతులకు రుణాలను రద్దు చేస్తామని చెప్పామని, దానిని అమలు చేశామని గుర్తు చేశారు.
రక్షణ దళాల్లో నియామకాల కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం క్రింద ఎంపికలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నప్పటికీ ఈ పథకాన్ని ఉపసంహరించేది లేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2022 జూన్ 14న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం క్రింద నాలుగేళ్ళ స్వల్పకాలిక నియామకాల కోసం యువతను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు.