ఇజ్రాయెల్ లో మూడేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. మాజీ పీఎం నెతన్యాహు మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని రైట్-వింగ్ కూటమి 64 స్థానాలు సొంతం చేసుకున్నది. దీంతో నెతన్యాహు విజయం సాధించినట్లుగా అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన వ్యక్తిగా నెతన్యాహు ఇప్పటికే రికార్డు సృష్టించారు. తాజాగా మరోసారి ఆయన ప్రధాని పీఠం ఎక్కనున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ఇందులో 62 సీట్లు గెలుపొందిన పార్టీయే అధికారం చేపట్టనుంది. దీంతో 73 ఏండ్ల నెతన్యాహు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. ఆయన నాయకత్వంలోని లికడ్ (Likud) పార్టీ సొంతంగా 32 స్థానాల్లో విజయం సాధించింది. దేశంలో నాలుగేండ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి కావడం విశేషం.