లండన్: బ్రిటన్ హోంశాఖ మంత్రి, భారత సంతతికి చెందిన సుయెలా బ్రేవర్మన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. బ్రిటన్ దక్షిణ తీరంలో శరణార్థుల తాకిడిని ఆమె.. వలసదారుల దండయాత్ర గా అభివర్ణించడం దుమారం రేపింది. ఇంగ్లాండ్ దక్షిణ తీరంలోని ఓ శరణార్థుల కేంద్రంపై పెట్రోల్ బాంబు దాడి జరిగిన మరుసటి రోజే.. పార్లమెంట్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ప్రతిపక్షాలతోపాటు స్థానిక శరణార్థ సంఘాలూ బ్రేవర్మన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి.‘దేశంలో అక్రమ వలసలు నియంత్రణలో లేకుండా పోయాయి. ఇంగ్లీష్ ఛానల్ ద్వారా పెద్ద సంఖ్యలో వలసదారులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది ఒక్క దక్షిణ తీరానికే చేరుకున్నారు. క్రిమినల్ గ్యాంగ్‌ల సాయంతో వారు ఇక్కడ అడుగుపెడుతున్నారు. పైగా.. అందులో కొందరు ఆ ముఠాల సభ్యులే. కాబట్టి, వచ్చే వారందరనీ కష్టాల్లో ఉన్నవారిగా భావించడం తగదు. ప్రతిపక్షాలు మాత్రం వేరేలా వాదిస్తున్నాయి. దక్షిణ తీరంలో ‘వలసదారుల దండయాత్ర’ను కట్టడి చేసే విషయంలో ఏ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందో ప్రజలకు తెలియాలి’ అని బ్రేవర్మన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వలసదారుల దండయాత్ర వ్యాఖ్య కాస్త వివాదాస్పదమైంది.
హోం మంత్రి అత్యంత తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారని ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శించింది. దేశ భద్రతపై సీరియస్‌గా ఉన్న ఏ హోం మంత్రి కూడా ఇలా మాట్లాడరని లేబర్ పార్టీ నేత యివెట్ కూపర్ అన్నారు. ప్రధాని రిషి సునాక్ చెప్పే దయాపూరిత సంప్రదాయవాదాన్ని ఇటువంటి భాష అపహాస్యం చేస్తుందని స్కాటిష్ నేషనల్ పార్టీ పేర్కొంది. బ్రిటన్ శరణార్థుల మండలి కూడా బ్రేవర్మన్ వ్యాఖ్యలను ఖండించింది. ‘శరణార్థుల దుస్థితిని దండయాత్రగా అభివర్ణించడం తగదు. వారంతా యుద్ధం, ఘర్షణల వాతావరణం నుంచి బయటపడేందుకు వస్తున్నవారు’ అని తెలిపింది. బ్రిటన్ రాజకీయాల్లో బ్రేవర్మన్ ఇప్పటికే పలు వివాదాలకు కారణమయ్యారు. వీసా పరిమితి దాటినా.. దేశంలోనే ఉండిపోతున్నారంటూ భారతీయులను ఉద్దేశించి సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిజ్ ట్రస్ ప్రభుత్వంలోనూ హోంశాఖ మంత్రిగా ఉన్న ఆమె.. వృత్తిపర తప్పిదాలతో రాజీనామా చేశారు. అయితే.. బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ ఆమెను తిరిగి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నేరస్థులపై ఉక్కుపాదం మోపడంతోపాటు దేశ సరిహద్దులను రక్షించుకోవడంపై ఆమె దృష్టి సారిస్తారని పేర్కొంటూ.. ప్రతిపక్షాల విమర్శలకు బదులిచ్చారు.