భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వేగంగా
పుంజుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్ తర్వాతి స్థానానికి ఆయన చేరుకొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున
అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో వివేక్ రామస్వామి
దూసుకెళ్తున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానానికి ఆయన
చేరుకొన్నారు. తాజాగా నిర్వహించిన జీవోపీ పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. దీని
ప్రకారం రామస్వామి మూడోస్థానం నుంచి ద్వితీయ స్థానానికి ఎగబాకినట్లు స్థానిక
మీడియా కథనాలు వివరించాయి. ఈ రేసు కోసం జరుగుతున్న ప్రాథమిక పోల్స్‌లో 39 శాతం
మంది మద్దతుతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రథమ స్థానంలో ఉన్నారు. 13
శాతం మద్దతుతో వివేక్ రామస్వామి ద్వితీయ స్థానానికి చేరారు. దీంతో ట్రంప్‌నకు
ఆయనే ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశముంది.
మరోవైపు భారత సంతతికి చెందిన మహిళా అభ్యర్థి నిక్కీహెలీ సైతం 12 శాతం ఓట్లతో
తృతీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ట్రంప్‌నకు ప్రధాన పోటీదారుగా
ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ రెండు స్థానాలు దిగజారి.. అయిదో
స్థానానికి పడిపోయారు. గత జులైలో 26 శాతం ఓటర్ల మద్దతుతో ద్వితీయస్థానంలో ఉన్న
డిశాంటిస్ ప్రస్తుతం కేవలం 6 శాతం మద్దతుకే పరిమితమయ్యారు. న్యూజెర్సీ మాజీ
గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11 శాతం మద్దతుతో నాలుగోస్థానంలో ఉన్నారు. అమెరికా
మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్రంగా మండిపడ్డారు వివేక్ రామస్వామి. బరాక్ ఒబామా
అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన ‘ఒబామా కేర్’ను రద్దు చేస్తానని
చెప్పిన ట్రంప్.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఇప్పటివరకు ట్రంప్
విధానాలను ప్రశంసిస్తూ వచ్చిన వివేక్.. తాజాగా ఆయనపై విరుచుకుపడ్డారు.
దీంతోపాటు విదేశాంగ విధానంపై మాట్లాడిన వివేక్ చైనా నుంచి ఆర్థిక స్వాతంత్ర్యం
సంపాదించుకోవాలని వ్యాఖ్యానించారు. భారత్ లాంటి దేశాలతో సంబంధాలను పెంచుకుని
చైనా ఆర్థిక ఊబి నుంచి బయటపడాలని సూచించారు. చైనా పార్మాసూటికల్స్ సరఫరాను
తగ్గించి ఆ మొత్తాన్ని రక్షణ రంగంపై ఖర్చు చేయాలన్నారు. గత నెలలో జరిగిన
రిపబ్లికన్ పార్టీ తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత వివేక్‌కు ప్రజాదరణ
పెరిగింది. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీతో పోటీపడి ప్రజలను
ఆకట్టుకున్నారు. అయితే ట్రంప్‌నకు, ‘అతడి అమెరికా ఫస్ట్’ విధానాలకు బహిరంగంగా
మద్దతు తెలుపుతున్న, ఏకైక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అశావహుడు వివేక్ ఒక్కరే.