ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్
పునరుద్ఘాటించారు. వైద్యనిపుణుల బృందాన్ని అక్కడికి పంపించేందుకు సిద్ధంగా
ఉన్నట్లు చెప్పారు. వూహాన్ ల్యాబ్ నుంచే కొవిడ్-19 వైరస్ బయటకొచ్చిందని
ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిజనిర్ధారణకు పూర్తి సహకారం
అందించాలని చైనాను మరోసారి కోరినట్లు ఓ అంతర్జాతీయ మీడియాకు ఆయన తెలిపారు.
చైనాతో ద్వైపాక్షిక సమావేశాల్లోనూ ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని చర్చకు
తీసుకురావాలని ఆయన కోరారు. వూహాన్ ల్యాబ్లో పరిశోధనలకు అనుమతిస్తే,
డబ్ల్యూహెచ్వో నుంచి బృందాన్ని పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనాకు ఇప్పటికే
లేఖ రాసినట్లు ఆయన గుర్తు చేశారు.
కరోనా వైరస్ పుట్టుకపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేదు. 2019 చివర్లో
చైనాలోని వూహాన్ నగరంలో తొలి కేసు నమోదైంది. వూహాన్లో వైరస్లపై పరిశోధన
చేసే ప్రయోగశాల నుంచే కొవిడ్-19 వైరస్ బయటకొచ్చిందని కొందరు చెబుతుంటే
కొవిడ్ సోకిన జంతువు నుంచి మానవులకు వ్యాప్తి చెంది ఉండొచ్చని మరొక వాదన
ఉంది. దీనిపై 2021లో డబ్ల్యూహెచ్వో ఓ నిజనిర్ధారణ కమిటీని వేసింది. చైనా
వైద్య బృందంతో కలిసి పరిశోధనలు చేసిన ఆ కమిటీ.. ఉమ్మడి నివేదికను
వెల్లడించింది. వూహాన్ మార్కెట్లో ఓ గబ్బిలం నుంచి ఈ వైరస్ మానవులకు సోకి
ఉండొచ్చని చెప్పింది. మిగతా వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. దీనిపై పలు
అనుమానాలు వ్యక్తం కావడంతో నిజనిర్ధారణకు తమ బృందాన్ని మాత్రమే అనుమతించాలని
డబ్ల్యూహెచ్వో పలుమార్లు కోరింది. దీనికి చైనా ఏమాత్రం అంగీకరించడం లేదు.
అయినప్పటికీ, తమ దర్యాప్తును విరమించే ప్రసక్తే లేదని డబ్ల్యూహెచ్వో చీఫ్
చెబుతున్నారు. అమెరికా లాంటి అగ్రదేశాల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ వూహాన్
ల్యాబ్లో వైరస్ పుట్టుకపై నిజనిర్ధారణ చేసేందుకు చైనా నుంచి ఏమాత్రం మద్దతు
లభించడం లేదు.