దక్షిణ కొరియాలోని హాలోవీన్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. శనివారం రాత్రి జరిగిన ఈ భయానక ఘటనలో 151 మంది మరణించారు. వీరిలో 19 మంది విదేశీయులు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. అయితే, వందల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. రాజధాని సియోల్‌లోని ఓ ఇరుకు వీధిలోకి శనివారం ఒక్కసారిగా ప్రజల గుంపు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 151 మంది మృతి చెందారు. ఇరుకు వీధిలోకి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో చాలామంది భయపడిపోయారు. దాదాపు 50 మందికి గుండెపోటు సంభవించినట్లు సమాచారం. ఇటావాన్ లీజర్ డిస్ట్రిక్ట్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. చాలామంది ప్రజలు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. శ్వాస తీసుకోవడం లో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 81 అత్యవసర కాల్స్ వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ దేశంలో ఇటీవల కొవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత పెద్దఎత్తున హాలోవీన్ ఉత్సవాలు జరుగుతున్నాయి. సమీపంలోని బార్‌కు ఒక సినీతార వచ్చారనే సమాచారంతో అక్కడికి వెళ్లేందుకు ఒకేసారి అనేకమంది ప్రయత్నించడమే తొక్కిసలాటకు కారణమని స్థానిక ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయి. కరోనా ఆంక్షల్ని ఇటీవల సడలించడంతో వేడుకలకు దాదాపు లక్షమంది వరకు హాజరయ్యారని అవి తెలిపాయి.