హిజాబ్ సరిగా ధరించలేదనే అభియోగంపై ఇరాన్ లో అరెస్టయిన ఓ యువతి పోలీసు కస్టడీలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యమాలకు దారి తీసింది. అక్కడ చెలరేగిన అల్లర్లు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత వారాంతం మొదలైన అల్లర్లలో ఇప్పటివరకు 31 మంది చనిపోయినట్లు సమాచారం. ఇందులో ఆందోళనకారులతోపాటు పోలీసులు కూడా ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇరాన్ కఠిన చట్టాలు, పోలీసు జులుంను వ్యతిరేకిస్తూ టెహ్రాన్ సహా 17 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలుచోట్ల భద్రతాదళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. కాగా, ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలకు సంబంధించి టెహ్రాన్‌లో సుమారు వెయ్యి మందిపై అక్కడి అధికారులు అభియోగాలు మోపారు. దేశవ్యాప్తంగా 14,000 మంది అరెస్టు అయినట్లు కుర్దిష్ మానవ హక్కుల సంస్థ హెంగావ్ ద్వారా తెలుస్తోంది. నిరసనలకు సంబంధించిన సమాచారం విస్తృతంగా ప్రచారం కాకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇరాన్లో ప్రభుత్వ పెద్దలు, కీలక అధికారులు మినహా ఇతరులెవరూ ఫేస్బుక్, టెలిగ్రామ్, ట్విటర్, యూట్యూబ్ వంటివి వినియోగించకుండా ఇప్పటికే ఆంక్షలు విధించారు.