మాస్కో : వాగ్నర్ కిరాయి సైనిక ముఠా అధినేత యెవెగనీ ప్రిగోజిన్ మృతిని
రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. బుధవారం మాస్కో నుంచి సెయింట్
పీటర్స్బర్గ్కు బయల్దేరిన విమానం మార్గమధ్యంలో కుప్పకూలి 10 మంది మృతి
చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద అనంతరం విమాన ప్రయాణికుల జాబితాలో
ప్రిగోజిన్. వాగ్నర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన దిమిత్రి ఉత్కిన్, ఆ గ్రూపులోని
ఇతర కీలక సభ్యులు ఉన్నట్లు రష్యా ప్రకటించింది. అధికారికంగా మరణాలను
ప్రకటించలేదు. విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. జన్యు విశ్లేషణలను,
బ్లాక్బాక్స్ను పరిశీలించి ఈ కమిటీ పరిశీలించి ఆదివారం తన నివేదికను
వెల్లడించింది. ‘‘మృతి చెందిన 10 మంది గుర్తింపును ధ్రువీకరించాం. విమానంలో
ప్రయాణిస్తున్న వారి వివరాలతో మా సమాచారం సరిపోలింది’’ అని తెలిపింది. మరోవైపు
శుక్రవారం జిటోమర్ ప్రాంతంలోని గగనతలంలో రెండు విమానాలు ఢీకొని.. ముగ్గురు
పైలట్లు మృతి చెందిన ఘటనపై ఉక్రెయిన్ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో
ప్రముఖ పైలట్ ఆంద్రీ పిలెశ్చెకోవ్ కూడా ఉన్నారు. రష్యా దురాక్రమణ
ప్రారంభమైనప్పటి నుంచి ఈ ముగ్గురు పైలట్లు దేశానికి కీలక సేవలందించారని
ఉక్రెయిన్ పేర్కొంది.