ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ట్విటర్ విక్రయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఇప్పుడిది తెలివైన వ్యక్తి చేతుల్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 44 బిలియన్ డాలర్లతో ఆయన ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ట్విటర్ విక్రయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఇప్పుడిది తెలివైన వ్యక్తి వ్యక్తి చేతుల్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘ట్విటర్ ఇప్పుడు స్థిరచిత్తం కలిగిన వ్యక్తి చేతుల్లో ఉంది. దీంతోపాటు అమెరికాను ద్వేషించే ర్యాడికల్ లెఫ్ట్ ఉన్మాదుల నిర్వహణ నుంచి బయటకు వచ్చింది. ఈ విషయాలపై చాలా సంతోషంగా ఉంది. సంస్థను తీవ్రంగా దెబ్బతీసిన నకిలీ ఖాతాలు, ఇతరత్రా కార్యకలాపాలను వదిలించుకోవడానికి ట్విటర్ కృషి చేయాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఆయన ట్విటర్‌కు తిరిగి వస్తారో లేదో మాత్రం వెల్లడించలేదు. 2021 జనవరిలో అగ్రరాజ్యంలోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి పరిణామాల నేపథ్యంలో.. ట్రంప్‌పై ట్విటర్ శాశ్వతంగా నిషేధం విధించింది. ట్విటర్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తామని ఎలాన్ మస్క్ గతంలోనే తెలిపారు. అయితే, తన అకౌంట్‌ను పునరుద్ధరించినా మళ్లీ అందులో చేరే ఉద్దేశం లేదని ట్రంప్ సైతం తేల్చి చెప్పారు. ట్విటర్‌కు పోటీగా.. ‘ట్రూత్ సోషల్’ పేరుతో సొంత సోషల్ మీడియా యాప్‌నూ ప్రారంభించిన విషయం తెలిసిందే.