బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్కు వింత అనుభవం ఎదురైంది. ఆస్పత్రిలో ఎలా చూసుకుంటున్నారు? అని మహిళా రోగిని అడగ్గా.. అంతాబాగానే ఉంది కానీ, మీరు వాళ్లకిచ్చే జీతాలను చూస్తేనే జాలేస్తోంది అంటూ ఆమె సమాధానమిచ్చింది.
లండన్: బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్కు వింత అనుభవం ఎదురైంది. రోగులను పరామర్శించేందుకు ఆయన సౌత్ లండన్లోని క్రొయిడన్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది బాగా చూసుకుంటున్నారా? అని అక్కడి ఓ మహిళా రోగిని అడగ్గా.. ‘‘చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ, మీరు వాళ్లకిచ్చే జీతాలను చూస్తేనే జాలేస్తోంది’’ అని ఆమె సమాధానం ఇచ్చారు. నేషనల్ హెల్త్ సర్వీసును మరింత బలోపేతం చేయాలని, నర్సుల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తోందని సునాక్ చెప్పేలోపే.. ఆమె మళ్లీ మాట అందుకొని.. మీరు మామూలుగా ప్రయత్నించడం కాదు..మరింత తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరముందని అన్నారు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన రిషి సునాక్ ‘‘ మీ మాటలను కచ్చితంగా పరిణగణలోకి తీసుకుంటాను. ఇక్కడ చాలా మంచి సిబ్బంది ఉన్నారు’’ అని సమాధానమిచ్చారు.
తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటీవల దాదాపు 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఓటింగ్ కూడా నిర్వహించారు. దాదాపు 106 ఏళ్ల చరిత్రలో ఇలా ఓటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు వేతనాల్లో పెరుగుదల లేదని, మరోవైపు, ద్రవ్యోల్బణంలో సరకుల ధరలు పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెల్లడించింది. ఎన్హెచ్ఎస్ కింద 1948 నుంచి బ్రిటన్లో ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వసేవలకు కేటాయించిన మొత్తంలో మూడింట ఒకవంతు వ్యయాన్ని బ్రిటన్ ఆరోగ్యసేవల కోసమే కేటాయిస్తోంది. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రోగుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో రోగులకు మునుపటిలా వైద్యసేవలు అందడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.