ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్లకు అడ్డూ అదుపు ఉండదిక. ఎందుకంటే మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లింది. కంపెనీని 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్.. ‘ది బర్డ్ ఈజ్ ఫ్రీడ్’ (పక్షికి విముక్తి లభించింది) అని ట్వీట్ చేశారు. ట్విటర్‌ను తన ఆధీనంలోకి తీసుకున్న కొన్ని గంటల్లోనే సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దె సహా నలుగురు ఉన్నతాధికారులకు ఉద్వాసన పలికారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సేన ఎడ్జెట్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. సీన ఎడ్జెట్నైతే భవనం బయటికి తీసుకెళ్లి మరీ సాగనంపారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు బిజ్ స్టోన మాత్రం అగర్వాల్, గద్దె, సెగల్‌కు ధన్యవాదాలు తెలిపారు. గురువారం రాత్రి ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేసిన 51 ఏళ్ల మస్క్.. ‘లెట్ ది గుడ్ టైమ్స్ రోల్’ (మంచి సమయం మొదలవ్వనీ..) అంటూ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. అంతేకాదు, తన ప్రొఫైల్‌లో తనను ‘చీఫ్ ట్విట్’గా అభివర్ణించుకున్నారు.