కెన్యాలో హత్యకు గురైన పాత్రికేయుడు అర్షద్ షరీఫ్ విషయంలో పాకిస్తాన్ చిక్కుల్లో పడింది. తాజాగా పాక్ పేరిట వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. అయితే ఆ లేఖను తాము రాయలేదని పాకిస్తాన్ వివరణ ఇస్తోంది. హత్యకు గురైన పాత్రికేయుడు అర్షద్ షరీఫ్‌ను కెన్యా నుంచి బహిష్కరించాలని విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ యూఏఈ అధికారులకు లేఖ రాశారని వచ్చిన వార్తలను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఖండించింది. ఆ లేఖ నిరాధారమైనదని, వాస్తవం కాదని వివరణ ఇచ్చుకుంది. ఆగస్టులో పాకిస్తాన్ నుంచి షరీఫ్ కొద్ది రోజులు యూఏఈకి వెళ్లాడు. అక్కడి నుంచి కెన్యా వెళ్లాడు. అయితే గత ఆదివారం రాత్రి ఆయన కెన్యాలో హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం అర్షద్ హత్య పాకిస్తాన్లో తుఫాను సృష్టించింది. అక్కడ రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు తారస్థాయికి చేరుకున్నాయి. ,