క్వీన్స్ ల్యాండ్ : కంబోడియాలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ‘అఖండ విజయం’
సాధించిన ప్రధానమంత్రి హన్సేన్ (70) వెంటనే పాలక కంబోడియన్ పీపుల్స్
పార్టీని సమావేశపరచి తన పెద్ద కుమారుడు హన్మానెట్ (45)ను భావి
ప్రధానమంత్రిగా ఎంపిక చేయించారు. మానెట్ బ్రిటన్లో ఆర్థిక శాస్త్రంలో
పీహెచ్డి చేసి, అమెరికాలో సైనిక శిక్షణ పొందారు. చిరకాలంగా ప్రభుత్వ
ఉక్కుపాదం కింద నలిగిపోతున్న కంబోడియా ప్రజలపై వారసత్వ పాలనను రుద్దడానికి
ప్రధాని హన్సేన్ నామ్కే వాస్తే ఎన్నికలను ఉపయోగించుకున్నారు. దశాబ్దాలుగా
దేశాన్ని ఏకఛతాధిపత్యంగా పాలిస్తున్న పీపుల్స్ పార్టీకి తాజా ఎన్నికల్లో
పేరుకే 17 ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ ఎదురైంది. అవన్నీ హున్ సేన్ అంటే
గడగడలాడే పార్టీలే. పాలక పార్టీకి నిజమైన సవాలుదారైన కంబోడియా నేషనల్
రెస్క్యూ పార్టీ విదేశీ శక్తుల తోడ్పాటుతో తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందనే
బోగస్ ఆరోపణతో సుప్రీంకోర్టు ఆ పార్టీని రద్దుచేయడంతో హన్సేన్కు ఎదురే
లేకుండా పోయింది.