క్రిమియా వంతెనపై మరోసారి దాడి
మాస్కో/కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రెండు కీలక పరిణామాలు చోటు
చేసుకున్నాయి. తెల్లవారుజామున క్రిమియా ద్వీపాన్ని, రష్యా ప్రధాన భూభాగాన్ని
కలిపే కీలక కెర్చ్ వంతెనపై దాడి జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటలకే
ఐక్యరాజ్యసమితి, తుర్కియే మధ్యవర్తిత్వంతో నిరుడు జులైలో కుదిరిన నల్లసముద్ర
ఆహారధాన్యాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు మాస్కో కీలక ప్రకటన చేసింది. ఇది
తీవ్ర పరిణామాలకు దారితీయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు పెరిగి
ప్రపంచాన్ని ఆహార సంక్షోభం దిశగా నెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల కారణంగా తమ ఆహార, ఎరువుల ఎగుమతులకు తీవ్ర
ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ఈ సమస్యలు పరిష్కారమైతేనే తిరిగి నల్లసముద్ర
ఆహారధాన్యాల ఒప్పందంలో చేరుతామని రష్యా ప్రకటించింది. ఉపసంహరణ నిర్ణయాన్ని ఆ
దేశ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించగానే షికాగో ట్రేడింగ్‌లో గోధుమల
కాంట్రాక్టు 3% పెరిగింది. గతేడాది జులైలో కుదిరిన ఈ ధాన్య ఒప్పందం ప్రకారం..
మూడు ఓడరేవుల నుంచి గోధుమలు, మొక్కజొన్న, బార్లీ తదితర ఆహారఉత్పత్తులను
నల్లసముద్రం మీదుగా ఉక్రెయిన్ ఎగుమతి చేసుకొనేందుకు రష్యా అంగీకరించింది. ఈ
నౌకలకు ఆటంకం కలిగించబోమని, వాటిపై దాడులు చేయబోమని హామీ ఇచ్చింది. ఇప్పుడు
రష్యా తప్పుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని,
ముఖ్యంగా కరవుతో విలవిల్లాడుతున్న కెన్యా, మొరాకో, సోమాలియా, టునీసియా తదితర
ఆఫ్రికాదేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు.
వంతెనపై దాడి.. ఉగ్ర చర్యే : మరోవైపు కెర్చ్ వంతెనపై దాడి మాస్కోను తీవ్రంగా
కలవరపరిచింది. ఈ బ్రిడ్జి నుంచే ఉక్రెయిన్‌లో పోరాడుతున్న తమ సేనలకు ఆయుధాలు,
ఇతర సరఫరాలను రష్యా భారీ స్థాయిలో చేరవేస్తోంది. ఇంతటి కీలక వంతెనపై సోమవారం
తెల్లవారుజామున 3 నుంచి 3.30 గంటల మధ్యలో రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ
ఘటనలో వేసవి సెలవులు గడిపేందుకు క్రిమియాకు కారులో వెళుతున్న ఓ కుటుంబం
ప్రమాదానికి గురైంది. దంపతులు మృతి చెందారు. వారి కుమార్తెకు తీవ్ర
గాయాలయ్యాయి. పేలుడుతో వంతెనలో కొంత భాగం దెబ్బతింది. ఇందుకు సంబంధించి
క్రిమియా 24 ఆన్లైన్ న్యూస్ ఛానల్ ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో వంతెన
కిందకు ఒరిగినట్లు కనిపించింది. ఎక్కడా నీళ్లలో పడినట్లు లేదు. రహదారిపై
రాకపోకలు నిలిపివేశారు. ఉక్రెయిన్‌కు చెందిన రెండు సముద్ర డ్రోన్లు ఈ దాడిలో
పాల్గొన్నట్లు రష్యా ఉగ్రవాద నిరోధక కమిటీ తెలిపింది. వంతెనపై దాడిచేసింది
తామేనని ఉక్రెయిన్‌కు చెందిన సైనిక అధికారులు వెల్లడించినట్లు సీఎన్ఎన్
వార్తా సంస్థ తెలిపింది. ఉక్రెయిన్ నుంచి క్రిమియా ద్వీపాన్ని 2014లో రష్యా
ఆక్రమించింది. అనంతరం తమ ప్రధాన భూభాగంతో ఈ ద్వీపాన్ని కలుపుతూ సుమారు
రూ.29వేల కోట్ల వ్యయంతో ఈ రోడ్డు, రైలు వంతెనను నిర్మించింది. ఐరోపాలోనే
అత్యంత పొడవైన (19 కిలోమీటర్లు) రైలు, రోడ్డు వంతెనగా దీనికి పేరుంది.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యానికి నిత్యావసరాలు, ఆయుధాలు సరఫరాలో కీలక
పాత్ర పోషించిన ఈ వంతెనపై గతేడాది అక్టోబర్‌లోనూ భారీ దాడి జరిగింది. ఆ దాడితో
పోలిస్తే ఇది చిన్నదేనని రష్యా వర్గాలు తెలిపాయి.
అయినా ఎగుమతి చేస్తాం: జెలెన్స్కీ
రష్యా ఒప్పందం నుంచి వైదొలగినా తుర్కియే మద్దతుతో తాము ఆహార ధాన్యాలను ఎగుమతి
చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా మద్దతు
లేకపోయినా నల్లసముద్రాన్ని ఉపయోగించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం.
ఎవరికీ భయపడం. చాలా సంస్థలు, నౌకల యజమానులు మమ్మల్ని సంప్రదించారు. తుర్కీయే
అండగా ఉంటే ధాన్యాలు రవాణా చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.