క్యాడ్బరీ కంపెనీ చాలా పురాతనమైనదనే విషయం తెలియదు. 1902లో ఒక చిన్నారికి
స్కూలులో ఈ క్యాడ్బరీ చాక్లెట్ ఇవ్వగా, ఆమె జాగ్రత్తగా దానిని
దాచిపెట్టుకుంది.
విశేష సమయాల కోసం ప్రత్యేకంగా : వివరాల్లోకి వెళితే 1902లో ఇంగ్లండ్ కింగ్
ఎడ్వర్డ్-VII, క్వీన్ అలగ్జాండ్రాల పట్టాభిషేకం సందర్భంగా ఈ ప్రత్యేకమైన
చాక్లెట్ తయారుచేశారు. నాటి రోజుల్లో ఇంత ఖరీదైన చాక్లెట్లు పిల్లలకు అంత
సులభంగా లభించేవికాదు. నాటి రోజుల్లో చదువుకుంటున్న 9 ఏళ్ల మేరీ ఎన్
బ్లాక్మోర్కి లభ్యమైన ఈ చాక్లెట్ను తినకుండా, మహారాజుల పట్టాభిషేకానికి
గుర్తుగా జాగ్రత్తగా దాచుకుంది.
*దశాబ్దాల తరబడి ఆ కుటుంబం దగ్గరే : ఈ వెనీలా చాక్లెట్ మేరీ కుటుంబం దగ్గర
కొన్ని దశాబ్ధాలుగా భద్రంగా ఉంది. అయితే ఇప్పుడు మేరీ మనుమరాలు దీనిని వేలం
వేసేందుకు నిర్ణయించుకున్నారు. మేరీ మనుమరాలు జీన్ థమ్సన్కు ఇప్పుడు 72
సంవత్సరాలు. జీన్ ఈ చాక్లెట్ను తీసుకుని హెన్సన్కు చెందిన వేలందారుల
దగ్గరకు వెళ్లినప్పుడు వారు ఈ చాక్లెట్ అస్తిత్వాన్ని పరిశీలించారు.
చాక్లెట్ను చిన్నారి తాకనైనా లేద : హెన్సన్ వేలందారులలో సభ్యుడైన మార్వెన్
ఫెయర్లీ మాట్లాడుతూ ‘ఆ సమయంలో ఇది ఎంతో అమూల్యమైన కానుక. ఈ చాక్లెట్
చిన్నారులకు అంత సులభంగా లభ్యమయ్యేది కాదు. ఇది ఎంతో ప్రత్యేకమైనది కావడంతోనే
నాడు ఆ చిన్నారి కనీసం తాకకుండా కూడా భద్రపరిచింది’ అని అన్నారు. కాగా ఈ
చాక్లెట్ డబ్బాపై కింగ్, క్వీన్ల చిత్రాలు ముద్రితమై ఉన్నాయి.
వేలంలో లభించనున్న అత్యధిక మొత్తం : ఈ చాక్లెట్ వేలం హెన్సన్లో జరగనుంది.
వేలంలో దీని ధర కనీసంగా £100 నుంచి £150 (సుమారు రూ. 16 వేలు)వరకూ పలకనుందని
అంచనా. ఇంతకు మంచిన ధర కూడా పలకవచ్చని, ఎందుకంటే ఒక్కోసారి చాలామంది
చారిత్రాత్మక వస్తువులకు అధ్యధిక విలువ ఇస్తుంటారని మార్వెన్ ఫెయర్లీ
పేర్కొన్నారు.
డబ్బా తెరవగానే సువాసనలు : రాజ కుటుంబానికి చెందిన పురాతన వస్తువులపై అందరికీ
అమితమైన ఆసక్తి ఉంటుంది. ఈ 121 ఏళ్ల పురాతన చాక్లెట్ ఎప్పుడో ఎక్స్పైర్
అయిపోయింది. తినేందుకు ఏమాత్రం యోగ్యమైనది కాదు. దీనిని ఎవరూ తినలేరు కూడా.
అయినా ఈ టిన్ తెరవగానే సువాసనలు వస్తున్నాయని ఫెయర్లీ తెలిపారు.