పాకిస్థాన్‌కు త్వరలోనే కొత్త ఆర్మీ చీఫ్ రానున్నారు
ప్రస్తుత ఆర్మీచీఫ్ మరో ఐదువారాల్లో పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించారు
పాక్ ఆర్మీ చీఫ్ బాధ్యతల నుంచి తాను త్వరలోనే వైదొలగనున్నట్లు జనరల్ కమర్ జావేద్ బజ్వా శుక్రవారం ప్రకటించారు. మరో ఐదువారాలు మాత్రమే తాను ఈ పదవిలో కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. మరోసారి పొడిగింపు కోరనని తెలిపారు. దేశ రాజకీయాల్లో సైన్యం ఎటువంటి పాత్ర పోషించబోదని బజ్వా పేర్కొన్నారు. ఆయన రెండోసారి పొడింగింపు కోరతారని జరుగుతున్న ప్రచారానికి ఈ ప్రకటనతో ముగింపు పడినట్లైంది. బజ్వాకు గతంలో పొడిగించిన పదవీకాలం నవంబర్ 29తో ముగియనుంది. గతంలో కూడా ఆయన పొడిగింపు కోరనని తెలిపారు. దీంతో కొత్త ఆర్మీ చీఫ్ ఎవరు అవుతారనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది. లెఫ్టినెంట్ జనరల్ షహిర్ షంషాద్ మిర్జా, లెఫ్టినెంట్ జనరల్ అజర్ అబ్బాస్, లెఫ్టినెంట్ జనరల్ నుమాన్ మహమూద్ రజా, లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ అహ్మద్‌లు ఇప్పుడు రేసులో ముందున్నారు. ఇటీవల బజ్వా దాదాపు 12 మంది మేజర్ జనరల్స్‌కు ఒక్కసారిగా పదోన్నతులు కల్పించారు. మరోవైపు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు పడిన రోజే బజ్వా తన పదవీ విరమణ విషయాన్ని ప్రకటించడం గమనార్హం.