బీజింగ్ : జీ-7 దేశాల సదస్సు సంయుక్త ప్రకటనపై చైనా మండిపడింది. ఆయా దేశాలకు
తన దౌత్య నిరసనను తెలియజేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో నిస్సిగ్గుగా జోక్యం
చేసుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. కొన్ని పశ్చిమ దేశాలు ఇతర దేశాల
అంతర్గత వ్యవహారాల్లో ఇష్టారీతిన జోక్యం చేసుకోవడం, అంతర్జాతీయ సంబంధాలను
ప్రభావితం చేయడం వంటి వాటికి కాలం చెల్లింది. ప్రస్తుత సమస్యల మీద జీ-7 దేశాలు
దృష్టిపెట్టడం మంచిదని పేర్కొంది.
ఆ బెలూన్ ఘటన అంతా మార్చేసింది : బైడెన్
టోక్యో : చైనాకు చెందిన ఓ నిఘా బెలూన్ను తాము కూల్చివేసిన అనంతరం ఆ దేశంతో
చర్చల విషయంలో స్తబ్దత ఏర్పడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
అయితే తమ రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు అతి త్వరలో మళ్లీ మెరుగయ్యే
అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్లో జీ-7 శిఖరాగ్ర సమావేశం
అనంతరం మీడియా సమావేశంలో బైడెన్ ఈ మేరకు మాట్లాడారు.