హిరోషిమా : బఖ్ముత్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించడాన్ని
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఇప్పటివరకూ రష్యన్ సేనలు మా
నగరాన్ని స్వాధీనం చేసుకోలేదు. ‘‘మా ప్రజలను వారి మానాన వారిని వదిలేయలేం కదా.
అక్కడ ఏం జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుసు. కానీ మా పోరాట యోధులతో చర్చించే
సాంకేతిక విషయాలను మీతో పంచుకోలేనని జెలెన్స్కీ పేర్కొన్నారు. జపాన్‌లోని
హిరోషిమాలో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన జెలెన్స్కీ
ఆదివారం మీడియాతో మాట్లాడారు. అక్కడ ఏమీ మిగల్లేదని, రష్యా ఆ నగరాన్ని మొత్తం
నాశనం చేసిందని, భవనాలేవీ కనిపించడం లేదని, ఇదో విషాదమని తెలిపారు. బఖ్ముత్
తమ మనస్సుల్లోనే ఉందని, భౌతికంగా మొత్తం నేలమట్టమైందని, పలువురు రష్యన్లు
మరణించారని పేర్కొన్నారు. బఖ్‌ముత్‌లో భీకర యుద్ధం జరుగుతోందని ఉక్రెయిన్
రక్షణశాఖ ఉప మంత్రి హన్నా మల్యర్ చెప్పారు. శత్రువు బఖ్ముత్ను స్వాధీనం
చేసుకోవడంలో విఫలమయ్యాడు. కీలక ప్రాంతాలపై పట్టునూ కోల్పోయాడు. దీంతో మా దళాలు
సబర్బన్ ప్రాంతాలపై పట్టు సాధించాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంత
సైనిక అధికార ప్రతినిధి సెర్హీ ఇదే విషయం చెప్పారు. అధ్యక్షుడు నిజమే
చెప్పారని, రష్యన్లు నగరాన్ని ధ్వంసం చేశారని, రోజూ ఆయుధాలు, గగనతల దాడులతో
విరుచుకు పడుతున్నారని, పరిస్థితి క్లిష్టంగా ఉందని, భీకరపోరు సాగుతోందని
వివరించారు. ఉక్రెయిన్ వాదన ఇలా ఉంటే బఖ్ముత్ను స్వాధీనం చేసుకున్నందుకు
ప్రైవేటు సైన్యాధిపతి వాగ్నర్‌కు అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపినట్లు
రష్యా వార్తా సంస్థలు వెల్లడించాయి.