కమిటీ ముందు హాజరైన ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
మానవ సమాజ రక్షణ కోసం ఏఐపై నియంత్రణ
అత్యవసరమని వ్యాఖ్య
ఏఐపై నియంత్రణకు ఓ అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలని సూచన
మానవ సమాజం ప్రమాదంలో పడకుండా ఉండేందుకు కృత్రిమ మేధపై (ఏఐ) ప్రభుత్వ నియంత్రణ
అత్యవసరమని చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మెన్
తాజాగా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అమెరికా పెద్దల సభ సబ్‌కమిటీ ముందు హాజరై
ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐని నియంత్రించేందుకు అమెరికా కాంగ్రెస్ నిబంధనలను
రూపొందించాలని అభ్యర్థించారు. ఈ టెక్నాలజీతో భారీ సమస్యలు తలెత్తవచ్చని శామ్
హెచ్చరించారు. మానవ జీవితాన్ని కృత్రిమ మేధ అన్ని రకాలుగా మెరుగుపరుస్తుందన్న
నమ్మకంతో ఓపెన్ ఏఐ సంస్థను ఏర్పాటు చేశాము. అయితే, దీని వల్ల తీవ్ర ప్రమాదాలు
కూడా పొంచి ఉన్నాయి. ఈ ప్రమాదల నివారణకు ప్రభుత్వ నియంత్రణ ఎంతో అత్యవసరమని
నేను భావిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. చాట్‌జీపీటీ కంటే మరింత
సామర్థ్యమున్న ఏఐ అప్లికేషన్లకు లైసెస్సులు జారీ చేసే అధికారం కలిగిన
ప్రపంచస్థాయి నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. భద్రతా
నిబంధనలు పాటించని ఏఐ అప్లికేషన్ల లైసెన్సులు ఉపసంహరించే అధికారం ఈ సంస్థకు
ఉండాలని చెప్పారు.