ప్రస్తుత సరళిని బట్టి కాంగ్రెస్ ముందంజలో ఉంది. దాంతో తమ పార్టీ విజయం
సాధిస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం
చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టుగా తన తండ్రి పూర్తి మెజార్టీ సాధిస్తారని
అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని
వ్యాఖ్యానించారు. బీజేపీ కి అధికారం దూరం చేసేందుకు మేం చేయాల్సిందంతా
చేస్తాం. కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజార్టీ సాధిస్తుంది. ఇతర పార్టీల మద్దతు
లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కర్ణాటక ప్రయోజనాల కోసం మా
నాన్న ముఖ్యమంత్రి కావాలి. ఒక కుమారుడిగా నా తండ్రిని సీఎంగా చూడాలని
అనుకుంటున్నాను. అంతకుముందు ఆయన నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన
అందించింది. ఇంతకాలం భాజపా పాలనలో కొనసాగిన అవినీతి, విధానపరమైన లోపాలను ఆయన
సరిచేస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ముఖ్యమంత్రి కావాలని మీడియాతో
మాట్లాడుతూ యతీంద్ర వ్యాఖ్యానించారు. వరుణ నియోజవర్గం నుంచి తన తండ్రి భారీ
ఆధిక్యంతో విజయం సాధిస్తారని చెప్పారు.
కర్ణాటకలో బుధవారం ఓటింగ్ జరగ్గా శనివారం ఉదయం ఎనిమిది నుంచి కౌంటింగ్
కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్
ఆధిక్యంలో ఉండగా 70 పై చిలుకు స్థానాలో బీజేపీ లీడ్లో ఉంది. జేడీఎస్ 30
స్థానాల్లో ముందంజలో ఉంది. ఇదిలా ఉంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
ముఖ్యమంత్రి పదవికి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీఎంగా
పనిచేసిన సిద్ధూ మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇంకోపక్క
రాష్ట్ర అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పార్టీని ముందుండి నడిపించారు. హస్తం
పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయనది కీలక పాత్ర. ఆయనకూడా సీఎం పదవిపై తన
ఆసక్తిని పలుమార్లు పరోక్షంగా వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో అధిష్ఠానం ఏ
నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.