హాజరైన 2,200 మంది అతిరథ మహారథులు
వీధుల్లో ప్రజల హర్షాతిరేకం
బైబిల్‌ను చదివిన ప్రధాని రిషి
సైనికుల రాయల్ శాల్యూట్
లండన్ : అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా బ్రిటన్ రాజు ఛార్లెస్-3
పట్టాభిషేకం జరిగింది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో అత్యంత ఆడంబరంగా
జరిగిన కార్యక్రమంలో 74ఏళ్ల రాజుకు అర్చిబిషప్ కిరీట ధారణ చేశారు. దీంతో 40వ
రాజుగా ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించినట్లైంది. ఈ కార్యక్రమానికి వివిధ
దేశాల రాజ కుటుంబీకులు భారీగా తరలి వచ్చారు. తొలుత గౌరవసూచకంగా సైనికులు వెంట
నడవగా డైమండ్ జూబిలీ గుర్రపు బగ్గీపై రాజు ఛార్లెస్-3, రాణి కెమిల్లా
బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలివచ్చారు. 2.2
కిలోమీటర్ల దారి పొడవునా వేల మంది నిల్చుని బ్రిటన్ జాతీయ జెండాలతో అభివాదం
చేశారు. అబే పశ్చిమ ద్వారం నుంచి పట్టాభిషేకం జరిగే హాలులోకి రాజు దంపతులు
ప్రవేశించారు. పట్టాభిషేకానికి తరలివచ్చిన 2,200 మంది అతిరథ మహారథులు ఆయనకు
అభివాదం చేశారు. అందులో భారత దేశం తరఫున హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్
ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ఉన్నారు.
పట్టాభిషేకంలో మొదటిదైన ‘కాల్డ్ టు సర్వ్’ కార్యక్రమాన్ని హిందూ, సిక్కు,
ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దలతో కలిసి కాంటర్బరీ అర్చిబిషప్ జస్టిన్
వెల్బీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రిటన్ తొలి హిందూ ప్రధాని అయిన ప్రధాని
రిషి సునాక్ బైబిల్లోని వాక్యాలను చదివారు. వెంటనే లాంఛనంగా రాజు, రాణి
వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఛార్లెస్-3 ప్రమాణం చేశారు.
బ్రిటన్ ప్రజలను న్యాయం, దయతో పాలిస్తానని, అన్ని విశ్వాసాల ప్రజలు
బ్రిటన్‌లో స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పిస్తానని బైబిల్ సాక్షిగా
ప్రమాణం చేశారు. చర్చి ఆఫ్ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన క్రిస్టియన్‌గా
ఉంటానని రెండో ప్రమాణం చేశారు. ఆ తర్వాత బైబిల్‌ను ముద్దాడారు.
కిరీట ధారణ : ప్రమాణం, ప్రార్థనల తర్వాత 1300 సంవత్సరంలో ఎడ్వర్డ్ చేయించిన
సింహాసనాన్ని రాజు ఛార్లెస్-3 అధిష్ఠించారు. అనంతరం ఛార్లెస్-3ను జరూసలమ్
నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకించారు. చేతులు, ఛాతీ, తలపై నూనె పోశారు.
ఇదంతా తెరచాటున జరిగింది. నూనెతో అభిషేకం పూర్తయిన తర్వాత బంగారు తాపడంతో
చేసిన మహారాజ గౌన్ ధరించి సింహాసనంపై ఛార్లెస్-3 కూర్చున్నారు. ఆ తర్వాత
శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చి బిషప్ ఆయనకు
అందించారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగిన అనంతరం కిరీట ధారణ చేశారు. ఆ
తర్వాత సభికులంతా ‘గాడ్ సేవ్ కింగ్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజు
పట్టాభిషేక కుర్చీలోంచి లేచి రాజ ఖడ్గాన్ని పట్టుకుని ప్రత్యేకంగా చేయించిన
సింహాసనంపై ఆసీనులయ్యారు. సింహాసనంపై రాజు కూర్చోగానే ఆర్చి బిషప్తోపాటు
యువరాజు ప్రిన్స్ విలియం మోకాళ్లపై వంగి రాజు కాళ్లకు చేతిని ఆనించి ఆయన కుడి
చేతిని ముద్దాడారు. అనంతరం 75ఏళ్ల రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి
నిరాడంబరంగా కిరీట ధారణ చేశారు. ఆమె ధరించిన కిరీటంలో కోహినూర్ మినహా 2,200
వజ్రాలను పొదిగారు. రెండు గంటలపాటు జరిగిన పట్టాభిషేక కార్యక్రమం అబే గంటలు
మోగడంతో పూర్తయింది. ఆ తర్వాత రాజు, రాణి అబే నుంచి బకింగ్‌హాం ప్యాలెస్‌కు
బంగారు పూతతో ఉన్న గుర్రపు బగ్గీపై వెళ్లారు.
వెస్ట్‌మినిస్టర్ అబే 1066 నుంచి రాజుల పట్టాభిషేకానికి వేదికగా నిలుస్తోంది.
పట్టాభిషేకాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది ట్రాఫల్గర్ స్క్వేర్‌వద్ద ‘నాట్ మై
కింగ్’ అంటూ ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో
బ్రిటిష్ అవార్డులు గెల్చుకున్న భారత సంతతికి చెందిన బన్సారీ రూపారేలియా,
మంజు మల్హి, సౌరభ్ ఫడ్కే, గల్ఫ్షా, జే పటేల్ పాల్గొన్నారు. రాజు
పట్టాభిషేకం సందర్భంగా గౌరవ సూచకంగా గగనతలంలో బ్రిటన్ వాయుసేనకు చెందిన పదుల
సంఖ్యలో విమానాలు విన్యాసాలు చేశాయి. 56 కామన్వెల్త్ దేశాలకు చెందిన 240
కోట్ల మంది ప్రజలకు బ్రిటన్ రాజు అధిపతిగా ఉంటారు. ఇందులో భారత్ కూడా ఉంది.
పట్టాభిషేకంలో తొలిసారిగా అన్ని మతాల వారికి ప్రాధాన్యం లభించిందని ప్రధాని
రిషి సునాక్ తెలిపారు. ఇది అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమం కాదని, చరిత్ర,
సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా చూపే అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. బకింగ్‌హాం
ప్యాలెస్ వద్ద రాజు,రాణికి బ్రిటన్, కామన్వెల్త్ దేశాల సైనిక బలగాల నుంచి
రాయల్ శాల్యూట్ లభించింది. అక్కడి నుంచి ప్యాలెస్ బాల్కనీలోకి వచ్చిన రాజు,
రాణి అభిమానులకు అభివాదం చేశారు.
ఛార్లెస్-3 నేపథ్యమిదీ : ఛార్లెస్-3 1948 నవంబరు 14వ తేదీన జన్మించారు.
అత్యంత పెద్ద వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ
నుంచి 1970లో డిగ్రీ పట్టా అందుకున్నారు. డిగ్రీ అందుకున్న తొలి రాజుగా ఆయన
నిలిచారు. బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్ శిక్షణ పొంది నౌకాదళంలో
పని చేశారు. 1976లో సైనిక సేవల నుంచి రిటైరయ్యారు. మొదట డయానా అనే సామాన్య
మహిళను పెళ్లాడారు. వారికి విలియం, హ్యారీ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ
తర్వాత డయానాకు విడాకులిచ్చారు. 2005లో అప్పటి రాణి ఎలిజబెత్-2 అనుమతితో తన
చిరకాల మిత్రురాలు కెమిల్లాను ఛార్లెస్-3 వివాహం చేసుకున్నారు.
ఛార్లెస్-3కన్నా కెమిల్లా ఏడాది పెద్ద.
నవ్వుతూ కనిపించిన హ్యారీ : రాచరికాన్ని వదులుకున్న ఛార్లెస్-3 చిన్న
కుమారుడు హ్యారీ పట్టాభిషేకానికి హాజరయ్యారు. అయితే ఆయన ఒంటరిగానే వచ్చారు.
ఆయన భార్య మేఘన్ మెర్కెల్, ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉండిపోయారు. ఈ
వేడుకలో తన సోదరులతో కలిసి నడిచిన హ్యారీ నవ్వుతూ కనిపించారు.