ఆ విషయాన్ని ఆ దేశం గ్రహించాలి
ఎస్సీవో వేదికగా ధ్వజమెత్తిన భారత్
గోవా : ఉగ్రవాద పరిశ్రమకు పాకిస్థాన్ అధికార ప్రతినిధి అని.. అలాంటి దేశంతో
చర్చల ప్రసక్తే లేదని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్
కుండబద్ధలు కొట్టారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో పాల్గొనడానికి
పాక్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ వచ్చిన సందర్భంలోనే
జైశంకర్ ఇలా ఘాటు విమర్శలు చేశారు. ఉగ్ర పరిశ్రమను ప్రేరేపించే, సమర్థించే
అధికార ప్రతినిధిగా పాక్‌ను జైశంకర్ అభివర్ణించారు. ఆ దేశంతో చర్చలపై
మాట్లాడుతూ ‘‘ఉగ్రవాద బాధితులు.. ఉగ్రవాదులతో మాట్లాడరు. బాధితులు తమను తాము
రక్షించుకుంటారు. ఎదుర్కొంటారు. ఇప్పుడు మేం అదే పనిచేస్తున్నాం’’ అని
తెలిపారు. పాక్ విశ్వసనీయత వారి విదేశీ నిల్వల కంటే వేగంగా దిగజారిపోతోందని
సదస్సు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎస్సీవో సదస్సుకు
వచ్చిన బిలావల్‌ను తాము ఓ సభ్యత్వ దేశ మంత్రిగానే చూస్తున్నామని, అంతకుమించి
ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక
హోదా కల్పించే అధికరణం 370 రద్దుపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ 370
ముగిసిన చరిత్ర. ఆ విషయాన్ని పాక్ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది’’ అని
పేర్కొన్నారు. చైనాపైనా మంత్రి మాట్లాడారు. డ్రాగన్‌తో సంబంధాలు సాధారణంగా
లేవని అంగీకరించారు. సరిహద్దుల్లో ఉపసంహరణ ప్రక్రియ ముందుకు వెళితేనే, శాంతి
నెలకొంటుందని, అంతవరకు పరిస్థితులు మెరుగుపడవని స్పష్టం చేశారు. అయితే ఎస్సీవో
సదస్సులో పాల్గొనడానికి వచ్చిన చైనా విదేశాంగమంత్రి చిన్ గాంగ్ మాత్రం
సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.
ఆర్థిక మూలాలను తుంచేయాల్సిందే : అంతకుముందు భారత్ అధ్యక్షతన జరిగిన ఎస్సీవో
విదేశాంగమంత్రుల సదస్సులో జైశంకర్ ప్రసంగించారు. ఈ సమావేశానికి మన దేశం
ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. సదస్సులో రష్యా, చైనా, పాక్ విదేశాంగ మంత్రులు
సెర్గీ లవ్రోవ్, చిన్‌గాంగ్, బిలావల్ భుట్టో జర్దారీ సహా సభ్యదేశాల
మంత్రులంతా పాల్గొన్నారు. జైశంకర్ తన ప్రసంగంలో ఉగ్రవాదం అంశాన్ని ప్రధానంగా
ప్రస్తావించారు. పాక్ పేరు తీయకుండానే ఆ దేశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తీవ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సమర్థించకూడదని, సీమాంతర ఉగ్రవాదం పెనుముప్పు
అని పేర్కొన్నారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను తుంచేయాలని ఎస్సీవో దేశాలకు
పిలుపునిచ్చారు.
మేమూ బాధితులమే : సదస్సులో బిలావల్ మాట్లాడుతూ తమ దేశం కూడా ఉగ్రవాదానికి
బలైందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తానూ బాధితుడినేని, తన తల్లి బేనజీర్
భుట్టో కూడా ముష్కరుల చేతుల్లో హతమయ్యారని తెలిపారు. అయితే ఉగ్రవాదాన్ని దౌత్య
సంబంధాల్లో ఆయుధంగా వినియోగించకూడదంటూ పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి
వ్యాఖ్యానించారు. పాక్ విదేశాంగమంత్రి భారత్‌లో పర్యటించడం 12 ఏళ్ల తర్వాత
ఇదే తొలిసారి.