ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. అక్కడ ధరలు
ఆకాశాన్నంటుతున్నాయి. ధరల పెరుగుదల విషయంలో శ్రీలంకను కూడా దాటేసింది.
ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఏప్రిల్‌లో
పాకిస్థాన్ నిలిచింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. పాక్‌లో
రిటైల్ ధరలు గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 36.4 శాతం పెరిగినట్లు గణాంకాలు
చెబుతున్నాయి. 1964 తర్వాత ద్రవ్యోల్బణం ఈ స్థాయిలోకి చేరడం ఇదే తొలిసారి.
బ్లూమ్బెర్గ్సర్వే ప్రకారం ఏప్రిల్‌లో శ్రీలంక ద్రవ్యోల్బణం 35.3 శాతానికి
తగ్గడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనే సంకేతాలు వచ్చాయి. మరోవైపు
పాకిస్థాన్ కరెన్సీ పతనం కూడా ఆ దేశ కష్టాలను మరింత ఎగదోస్తోంది. 2023లో
పాక్ రూపాయి డాలర్‌తో పోలిస్తే 20 శాతం పతనమైంది. ప్రపంచంలోనే అత్యంత
బలహీనమైన కరెన్సీల్లో ఒకటిగా నిలిచింది. గత నెలలో పాక్ రూపాయి జీవిత కాల
కనిష్ఠానికి చేరింది. రవాణా ధరలు 56.8 శాతం పెరిగాయి. ఇక ఆహార ద్రవ్యోల్బణం
కూడా గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 48.1 శాతం పెరిగింది. దుస్తులు, పాదరక్షల
ధరలు 21.6 శాతం, హౌసింగ్, నీరు, విద్యుత్తుకు సంబంధించిన ధరలు 16.9 పెరిగాయి.
ఐఎంఎఫ్ నుంచి 6.5 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమాన్ని పునరుద్ధరించడానికి
పాక్ ఆపసోపాలు పడుతోంది. తాజాగా ఆ సంస్థ మెప్పుకోసం దేశీయంగా పూర్తిస్థాయిలో
పన్నులు పెంచాల్సి ఉంది. అప్పుడు ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ధరల
ఒత్తిడిని తగ్గించుకోవడానికి పాకిస్థాన్ గతనెల వడ్డీరేట్లను 21శాతానికి
చేర్చింది. 1956 తర్వాత ఈ స్థాయిలో వడ్డీ రేట్లు ఉండటం ఇదే తొలిసారి.
ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని
కార్మిక నేతలు ఇటీవల మేడే సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో ర్యాలీలను
కూడా అధికారులు నిషేధించారు. మెరుగైన హక్కుల కోసం పెషావర్‌లో కార్మిక సంఘాలు
గళమెత్తాయి. లాహోర్, కరాచీల్లో సెమినార్లు, ర్యాలీలు కొనసాగాయి.