తలో 7 డాలర్లమేర ఉచిత నగదు పంపిణీ కార్యక్రమం చివరకు ఘోర విషాదంతో ముగిసింది.
వందల సంఖ్యలో జనం తరలిరావడం, వారిని అదుపుచేసేందుకు సాయుధ హౌతీ
తిరుగుబాటుదారులు గాల్లోకి కాల్పులు జరపడం, ఆ తూటాలు తగిలి విద్యుత్ తీగల
వద్ద పేలిన శబ్దాలతో భయపడిన పేదజనం పరుగెత్తారు. దీంతో హఠాత్తుగా తొక్కిసలాట
చోటుచేసుకుంది. యెమెన్ రాజధాని సనా సిటీలోని ఓ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ
తొక్కిసలాటలో చిన్నారులు, మహిళలుసహా 78 మంది ప్రాణాలుకోల్పోయారు.73 మంది
గాయపడ్డారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని
ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. ఓల్డ్‌సిటీ
పరిధిలోని బాబ్ అల్–యెమెన్ ప్రాంతంలోని మయీన్ స్కూల్లో అర్ధరాత్రివేళ ఈ
ఘోరం సంభవించింది. నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహణలో విఫలమవడంతో దాతలైన ఇద్దరు
స్థానిక వ్యాపారవేత్తలను అరెస్ట్చేశామని హౌతీ రెబల్స్ నేతృత్వంలోని అంతర్గత
మంత్రిత్వ శాఖ తెలిపింది.
దారుణ మానవ విపత్తు : 2014లో యెమెన్ ఉత్తర ప్రాంతంపై పట్టు కోల్పోయిన హౌతీ
తిరుగుబాటుదారులు ఆ తర్వాతి ఏడాదే దేశ రాజధానిని తమ వశంచేసుకుని ఆ ప్రాంతాన్ని
పాలిస్తున్నారు. అదే ఏడాది గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా
నేతృత్వంలోని కూటమి ప్రయత్నించినా ఇంతవరకూ సాధ్యపడలేదు. ఆ ఆగ్రహమే పలు మలుపులు
తిరిగి నాటి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య శత్రుత్వాన్ని కొనసాగింది.
ఇన్నాళ్లలో అక్కడి ఘర్షణల్లో 1,50,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద
సంఖ్యలో పౌరులు, సైనికులను పొట్టనబెట్టుకున్న ఈ సంఘర్షణ ప్రపంచంలోనే అత్యంత
దారుణ మానవసంక్షోభాల్లో ఒకటిగా నిలిచింది. 2.1 కోట్ల దేశజనాభాలో మూడింట
రెండొంతుల మంది పేదలు అంతర్జాతీయ సాయంకోసం అర్రులుచాస్తున్నారు.