బీజింగ్ : తైవాన్ సమీపంలోని సముద్ర జలాల్లో చైనా సైనిక దళాలు ‘జాయింట్
సోర్డ్’ పేరిట చేపట్టిన యుద్ధ విన్యాసాలు ఆదివారం కూడా కొనసాగాయి. ద్వీప దేశం
చుట్టూ యుద్ధ విమానాలు, నౌకలను చైనా భారీగా మోహరించింది. తైవాన్ అధ్యక్షురాలి
అమెరికా పర్యటనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ చైనా ఈ విన్యాసాలు చేపట్టిన విషయం
తెలిసిందే. ఈ యుద్ధ విన్యాసాల్లో తైవాన్ను చుట్టుముట్టడంపై చైనా సైనికులు
సాధన చేస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్ వీటిని
నిర్వహిస్తోంది. దీనిపై చైనాకు చెందిన అధికారిక వార్తా సంస్థలో వచ్చిన ఓ
కథనంలో ‘‘టాస్క్‌ఫోర్స్ ఒకదాని తర్వాత మరొకటి గస్తీలు నిర్వహిస్తున్నాయి.
దీంతోపాటు తైవాన్ను ముట్టడిస్తున్నాయి. లాంగ్ రేంజ్ రాకెట్ ఆర్టిలరీ,
నేవల్ డెస్ట్రాయర్, మిసైల్ బోట్లు, ఎయిర్‌ఫోర్స్ ఫైటర్లు, బాంబర్లు,
జామర్లు వంటివి మోహరించారు’’ అని పేర్కొంది. సోమవారం జరిగే విన్యాసాల్లో
భాగంగా ఫుజియాన్‌లో లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టనున్నారు. తైవాన్‌కు చెందిన
మత్సు ద్వీపానికి ఇవి 80 కిలోమీటర్ల దూరంలో జరగనున్నాయి. తైవాన్
స్వాతంత్య్రాన్ని కోరుకొనే వేర్పాటువాద శక్తులు కలిసి చేపట్టే కవ్వింపు
చర్యలకు ఓ హెచ్చరిక వలే ఈ యుద్ధ విన్యాసాలు పనిచేస్తాయని పీఎల్ఏ ప్రతినిధి
చెప్పారు. మరోవైపు, చైనా యుద్ధ విన్యాసాలను తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్
యింగ్ వెన్ తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికాతో కలిసి పనిచేస్తామని తేల్చి
చెప్పారు. నియంతృత్వ విస్తరణ వాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా సహా భావసారూప్యత
ఉన్న దేశాలతో కలిసి నడుస్తామని పునరుద్ఘాటించారు.