జెరూసలేం : దక్షిణ లెబనాన్‌తోపాటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్
సైన్యం విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని హమాస్ ఉగ్రవాద శిబిరాలపై
తెల్లవారుజామున వైమానిక దాడులు నిర్వహించింది. బాంబుల వర్షం కురిపించింది.
దీంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి
కనిపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో యూదులు పాస్ఓవర్ అనే వేడుకలు
జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ
నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
గురువారం దక్షిణ లెబనాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ వైపు 30కిపైగా
రాకెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌లో ఇద్దరు గాయపడ్డారు. స్వల్పంగా
ఆస్తి నష్టం వాటిల్లింది. రాకెట్ల ప్రయోగానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్
సైన్యం దక్షిణ లెబనాన్‌లో పాతుకుపోయిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్
శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణులు లెబనాన్‌లో
టైర్ సమీపంలోని రషీదియా పాలస్తీనా కాందిశీకుల క్యాంప్ వద్ద నేలను తాకాయని
అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఒకరు వెల్లడించారు. లెబనాన్‌లోని
హిజ్బుల్లా మిలీషియాకు ఇరాన్ అండదండలు అందిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యంపై
హిజ్బుల్లా మిలీషియా దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు
చెబుతున్నారు. అయితే, తాము కేవలం పాలస్తీనా మిలిటెంట్ల శిబిరాలపైనే వైమానిక
దాడులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్
ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనా వాసి ఒకరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు
మహిళలు మృతి చెందారు.