అఫ్గానిస్థాన్ : తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్ మహిళలు ఎన్నో సవాళ్లు
ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భర్తల
చేతిలో హింసకు గురై, విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వారితోనే కలిసి
జీవించాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అఫ్గానిస్థాన్‌ను తమ
ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబాన్లు పలు అంశాల్లో ఆంక్షలు కొనసాగిస్తూనే
ఉన్నారు. ముఖ్యంగా మహిళల చదువు, ఉద్యోగాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
విద్యాసంస్థల మూసివేత మొదలు.. బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడంపైనా నిషేధం
విధిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మహిళల విడాకులను రద్దు చేసినట్లు సమాచారం.
దీంతో భర్తల చేతిలో వేధింపులకు గురై దూరంగా ఉంటున్న మహిళలను, తిరిగి వారి మాజీ
భర్తల వద్దకే వెళ్లి జీవించాలని ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు
వెల్లడించాయి.
అఫ్గాన్‌లో అమెరికా బలగాలు ఉన్న సమయంలో అక్కడి మహిళలకు కొంత స్వేచ్ఛ
లభించినట్లు కనిపించింది. కానీ, తాలిబన్లు వచ్చిన తర్వాత అవన్నీ చరిత్రలో
కలిసిపోయాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న వారిపైనా తాలిబన్లు ఉక్కుపాదం
మోపుతున్నారు. గతంలో చట్టపరంగా విడాకులు తీసుకున్న మహిళలను మాజీ భర్తతో
కలిసిపోవాలంటూ తాలిబాన్ కమాండర్లు ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. గృహహింసకు
వ్యతిరేకంగా పోరాడటం, చట్టపరంగా విడాకులు తీసుకున్నప్పటికీ వారి నుంచి దూరంగా
వెళ్లే అవకాశం లేకపోవడం వంటి సవాళ్లు అఫ్గాన్ మహిళలు ఎదుర్కొంటున్నట్లు ఐరాస
కూడా ఇటీవల పేర్కొంది.
గతంలో విడాకులు తీసుకున్న మహిళలు వారి మాజీ భర్తలతోనే కలిసి ఉండేలని ఒత్తిడి
తెస్తున్నారనడంపై తాలిబాన్ ప్రతినిధులు స్పందించారు. అటువంటి ఫిర్యాదులు
వస్తే దర్యాప్తు చేస్తామని.. అనంతరం షరియా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటామని
తాలిబాన్ అధికార ప్రతినిధి ఇనాయతుల్లా మీడియాకు వెల్లడించారు. గతంలో
తీసుకున్న విడాకులను ఆమోదిస్తారా అన్న ప్రశ్నకు ఇది ముఖ్యమైన, సంక్లిష్టమైన
సమస్య అని సమాధానం దాటవేయడం గమనార్హం.