వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మృతికి కారణమైన కొవిడ్-19
వైరస్ చైనాలోని ప్రయోగశాల నుంచే లీకైనట్లు అమెరికాకు చెందిన ఎనర్జీ
డిపార్ట్మెంట్ (యూఎస్డీఈ) నివేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు నివేదిక
ప్రతులను శ్వేతసౌధం, కాంగ్రెస్ ముఖ్యులకు సంబంధిత విభాగం సమర్పించినట్లు
వాల్‌స్ట్రీట్ జనరల్ వెల్లడించింది. వుహాన్ నగరంలోని హువానన్ మార్కెట్లో
తొలిసారి కనిపించిన సార్స్‌కోవ్-2 వైరస్ 2019 చివరి నుంచి ప్రపంచమంతటా
వ్యాపించింది. వైరస్ పుట్టుకపై నిపుణుల మధ్య వాడీవేడీ చర్చలు జరిగాయి. నిఘా
వర్గాల నివేదికలు వచ్చాయి. అయితే వుహాన్‌లోని ప్రయోగశాలలో జరిగిన ప్రమాదం
కారణంగానే వైరస్ బయటికి వచ్చినట్లు ఎఫ్‌బీఐ ఇచ్చిన నివేదికతో యూఎస్డీఈ
నివేదిక ఏకీభవించింది. ఇది బలంగా లేదని, తన అభిప్రాయాన్ని పేలవంగా
వ్యక్తపరిచిందని నివేదికను అధ్యయనం చేసిన వ్యక్తులు అభిప్రాయపడ్డారు. అమెరికా
జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలెవాన్ మాట్లాడుతూ వైరస్ పుట్టుక ప్రాంతంపై
నిఘా వర్గాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దీనిపై స్పష్టత తీసుకురావాల్సిందిగా
అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారని తెలిపారు. ఈ నివేదికను చైనా నిర్ద్వంద్వంగా
ఖండించింది.