రుణాల పునర్వ్యవస్థీకరణలో చైనా, ఐఎంఎఫ్ మధ్య కుదరని ఏకాభిప్రాయం
సాయం అందక ఇబ్బందుల్లో కూరుకుపోతున్న శ్రీలంక
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం తాజాగా
స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. నిధుల లేమి కారణంగా మార్చి 9న జరగాల్సిన
ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద కేవలం
500 మిలియన్ డాలర్ల విదేశీ మారకం మాత్రమే ఉండటంతో శ్రీలంక ప్రస్తుతం నిధుల
కొరతతో ఇక్కట్ల పాలవుతోంది. చైనా నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకున్న శ్రీలంక
ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం
శ్రీలంకకు సాయం అందించేందుకు ఐఎంఎఫ్ ముందుకు వచ్చింది. అయితే శ్రీలంక
చెల్లించాల్సిన రుణాల పునర్వ్యవస్థీకరణపై చైనాతో ఐఎంఎఫ్‌కు ఏకాభిప్రాయం
కుదరకపోవడంతో అడుగు ముందుకు పడటం లేదు. శ్రీలంకను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన
అమెరికా ఐఎంఎఫ్ ద్వారా సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చైనా
రుణాల చెల్లింపులపై 10 ఏళ్ల మారటోరియం విధించాలని శ్రీలంక కోరుతోంది. అయితే ఈ
వెసులుబాటు కల్పిస్తే చైనా లోన్లు తీసుకున్న ఇతర దేశాలకు ఇదే అవకాశం
కల్పించాల్సి వస్తుందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. ఈ పీటముడి
శ్రీలంకను మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.