రష్యాపై ఆంక్షల అమలుకు ప్రత్యేక యంత్రాంగం
వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య చేపట్టి ఏడాది అయిన సందర్భంగా మరో
రెండు బిలియన్ డాలర్లవిలువైన అధునాతన ఆయుధ సహాయాన్ని ఉక్రెయిన్‌కు
అందిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ కొత్త ప్యాకేజీ మేరకు మందుగుండు
సామగ్రి, అత్యాధునిక చిన్నపాటి డ్రోన్లను అందించనుంది. రష్యాకు చెందిన
మానవరహిత వ్యవస్థలు, వివిధ రకాల డ్రోన్లను అడ్డుకోగల ఆయుధాలు, ఆధునికీకరించిన
స్విచ్‌బ్లేడ్ 600 కమికాజే డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డిటెక్షన్
పరికరాలను తాజా సాయం కింద అందించనున్నట్లు పెంటగాన్ తాజా ప్రకటనలో
వెల్లడించింది. అంతేకాకుండా హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్
(హెచ్ఐఎంఏఆర్ఎస్)కు అదనపు మందుగుండు కొనుగోలుకు నగదు, ఆర్టిలరీ రౌండ్లు,
లేజర్ గైడెడ్ రాకెట్ వ్యవస్థలకు ఆయుధాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయంది.
అమెరికా, బ్రిటన్ కొత్త ఆంక్షలు : ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఏడాది
పూర్తయిన నేపథ్యంలో రష్యాపై అమెరికా, బ్రిటన్ శుక్రవారం మరిన్ని ఆంక్షలు
విధించాయి. రష్యా సంస్థలు, బ్యాంకులు, తయారీ సంస్థలు, లోహ, గనుల తవ్వక రంగాలకు
చెందిన కంపెనీలు, పలువురు పౌరులపై అమెరికా నూతన ఆంక్షలు అమలుకానున్నాయి. జీ-7
దేశాలతో సంప్రదింపుల అనంతరం కొత్త ఆంక్షలను విధించింది. ఇవి రష్యాపై
స్వల్పకాల, దీర్ఘకాల ప్రభావం చూపనున్నాయని అమెరికా ఆర్థికమంత్రి జానెట్
యెలెన్ ఓ ప్రకటనలో తెలిపారు.
మరోపక్క రష్యా యుద్ధ క్షేత్రానికి పరికరాలు అందించే పలు సంస్థలపై బ్రిటన్
కూడా తాజాగా ఆంక్షలు విధించింది. విమానాల విడిభాగాలు, రేడియో పరికరాలు,
ఆయుధాల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ కాంపోనెట్స్తో సహా యుద్ధంలో వినియోగించే
అన్ని రకాల ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆంక్షల
జాబితాలో రష్యాకు చెందిన పలు బ్యాంకులు, రక్షణ ఉత్పత్తుల సంస్థలు, ప్రభుత్వ
న్యూక్లియర్ పవర్ కంపెనీ రోసాటమ్ ఉన్నాయి.
రష్యాపై ఆంక్షల అమలుకు ప్రత్యేక యంత్రాంగం : రష్యాపై ఆంక్షల అమలుకు ప్రత్యేక
యంత్రాంగాన్ని (ఎన్ఫోర్స్మెంట్ కోఆర్డినేషన్ మెకానిజమ్) జీ-7 దేశాలు
ఏర్పాటు చేయనున్నాయి. యుద్ధంపై జీ-7 దేశాల నేతల సమావేశాన్ని అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్‌గా నిర్వహించనున్నారు. యుద్ధానికి రష్యాను
జవాబుదారీ చేసేందుకు సమష్టిగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా
చర్చించనున్నారు. ఆంక్షల అమలు యంత్రాంగానికి తొలి ఏడాది అమెరికా నేతృత్వం
వహిస్తుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ వెల్లడించింది. జీ-7లో
అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే సభ్య దేశాలుగా
ఉన్నాయి.