వాషింగ్టన్ : ప్రముఖ భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష
ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున
అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు ప్రాథమిక ఎన్నికల్లో ఆయన పోటీ
చేయనున్నారు. ఈ విషయాన్ని రామస్వామి స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ దఫా అమెరికా
అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న రెండో భారత సంతతి వ్యక్తిగా ఆయన
నిలిచారు. రిపబ్లికన్ పార్టీ తరఫున మరో ప్రముఖ భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ
కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆదర్శాలను
పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు
రామస్వామి తెలిపారు. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవడం
ప్రస్తుతం తమ దేశం ముందున్న ప్రధాన సవాలు అని పేర్కొన్నారు. రామస్వామి 1985
ఆగస్టు 9న ఒహైయోలో జన్మించారు. వయసు 37 ఏళ్లు. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి
అమెరికాకు వలస వెళ్లారు. రామస్వామి హార్వర్డ్, యేల్ విశ్వవిద్యాలయాల్లో
చదువుకున్నారు. గతేడాది స్ట్రైవ్ అస్సెట్ మేనేజ్మెంట్ అనే సంస్థను
స్థాపించారు. అంతకుముందు ఔషధ రంగంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు.