టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపంతో సుమారు 7లక్షల కోట్ల రూపాయల నష్టం
వాటిల్లినట్లు అంచనా. ఇది ఆయా దేశాల జీడీపీలో పది శాతం కంటే ఎక్కువని
తెలుస్తోంది. మరణాల సంఖ్య కూడా 72,000కు పెరగవచ్చని తాజా నివేదిక పేర్కొంది.
మరోవైపు తుర్కియేలో 200గంటల తర్వాత శిథిలాల నుంచి 18ఏళ్ల యువకుడిని సహాయ
బృందాలు ప్రాణాలతో కాపాడాయి. భూకంపం వల్ల విధ్వంసం ఎక్కువగా ఉండటానికి నిర్మాణ
కాంట్రాక్టర్లే కారణమని అధికారులు ఆరోపిస్తున్నారు. టర్కీ, సిరియాలో పెను
విషాదాన్ని నింపిన భూకంపం ఆ దేశాలకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది.
ప్రాణనష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 6న
సంభవించిన భూకంపం వల్ల.. సుమారు రూ.6.95లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని
తుర్కియేలోని వాణిజ్య సంఘాలు అంచనా వేశాయి. ఇది ఆయా దేశాల జీడీపీలో 10శాతం
కంటే ఎక్కువని పేర్కొన్నాయి. తీవ్ర భూకంపం ధాటికి ఒక్క తుర్కియేలోనే 25,000
ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 42,000 ఇళ్లు
కూలిపోవడమో లేదా అత్యవసరంగా కూల్చాల్సిన పరిస్థితి తలెత్తిందని తుర్కియే
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మురాత్ కురుమ్ తెలిపారు.
కేవలం నివాస ప్రాంతాలు దెబ్బతినడం వల్లే 70.75 బిలియన్ డాలర్ల ఆర్థికనష్టం
వాటిల్లినట్లు టర్కిష్ ఎంటర్ప్రైజ్ అండ్ బిజినెస్ కాన్ఫెడరేషన్
ప్రాథమికంగా అంచనా వేసింది. జాతీయాదాయానికి 10.4బిలియన్ డాలర్లు, పనిరోజుల
పరంగా 2.91 బిలియన్ డాలర్ల నష్టం కలిగినట్లు తెలిపింది. భూకంపం వల్ల
తుర్కియేకు 84 బిలియన్ డాలర్ల నష్టం జరిగిందని అంచనా వేసింది. ఇది ఆ దేశ
జీడీపీలో 10 శాతం కన్నా ఎక్కువని పేర్కొంది. మరణాల సంఖ్య కూడా భారీగా
పెరగవచ్చని సుమారు 72,000 మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తాజా నివేదికలో
వెల్లడించింది.
మరోవైపు టర్కీ-సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు
ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.
అదియమాన్ నగరంలో200 గంటల తర్వాత 18ఏళ్ల యువకుడిని సహాయ బృందాలు శిథిలాల కింది
నుంచి ప్రాణాలతో కాపాడాయి. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుని ఉండే
అవకాశం ఉంది. గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు బాధితులను రక్షించేందుకు
శ్రమిస్తున్నాయి. అయితే, భూకంపం సంభవించి వారం రోజులు పూర్తవడం వల్ల శిథిలాల
కింద చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడతారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. శిథిలాల
కింద ఉన్నవారిని గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్, థర్మల్ కెమెరాలను
వినియోగిస్తున్నారు.