ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సామాజిక
మాధ్యమ దిగ్గజం ట్విటర్ ఆర్థిక కష్టాలతో సతమతమవుతోంది. దాన్ని
గట్టెక్కించేందుకు ఎలాన్ మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో
ఉద్యోగుల తొలగింపు, ట్విటర్ బ్లూ వంటి మార్పులను తీసుకొచ్చారు. తాజాగా మరో
కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. వాణిజ్య ప్రకటనలు లేని ట్విటర్
వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ట్విటర్లో ప్రకటనలు
చాలా తరచూ కనిపిస్తాయని మస్క్ తెలిపారు. అలాగే చాలా పెద్దగా ఉంటాయని కూడా
పేర్కొన్నారు. దీన్ని రాబోయే వారాల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. కొంచెం
ఎక్కువ ధరతో దీన్ని ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కింద తీసుకురానున్నట్లు
వెల్లడించారు. దీన్ని ఎంపిక చేసుకున్నవారికి ఎలాంటి ప్రకటనలు ఉండబోవని
తెలిపారు.
ఇది కార్యరూపం దాలిస్తే ట్విటర్ వ్యాపార నమూనాలో పెద్ద మార్పు జరిగినట్లే.
ఇప్పటి వరకు ట్విటర్ ఆదాయం కోసం వాణిజ్య ప్రకటనలపైనే ప్రధానంగా ఆధారపడుతోంది.
ట్విటర్‌ను మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ట్విటర్ బ్లూ వంటి పెయిడ్
సబ్స్క్రిప్షన్ పాలసీలను తీసుకొచ్చారు. వ్యయ నియంత్రణలో భాగంగా మస్క్
దాదాపు సగానికి పైగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ కీలక మార్పుల
నేపథ్యంలో కంపెనీలు ట్విటర్‌కు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తూ
వస్తున్నాయి. దీంతో ఆదాయం గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. ఈ గడ్డుకాలం నుంచి
గట్టెక్కేందుకు మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యయాలను గణనీయంగా
తగ్గించడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడమే తన వ్యూహమని మస్క్ గతంలో స్పష్టం
చేశారు. అందులో భాగంగానే ట్విటర్ బ్లూ తీసుకొస్తున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సబ్స్క్రిప్షన్ అమెరికాలో నెలకు 11 డాలర్లకు అందుబాటులో ఉంది.
వెబ్ సబ్స్క్రిప్షన్ నెలకు 8 డాలర్లు, ఏడాదికి 84 డాలర్ల రాయితీ వద్ద
లభిస్తోంది.