లండన్ : భారతీయ మూలాలున్న ప్రస్తుత బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్
నాయకత్వంపై ఆ దేశ ప్రజలు అధిక విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక సమర్థత, పాలనా
విషయాల్లో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కన్నా రిషి వైపే ఎక్కువ మంది మొగ్గు
చూపారు. ఇండిపెండెంట్ పత్రిక కోసం సవంతా కామ్రెస్ నిర్వహించిన తాజా సర్వే ఈ
విషయాలు వెల్లడించింది. రిషి, బోరిస్ ఇద్దరూ టోరీ పార్టీ నేతలు. వీరిద్దరిలో
ఎవరి నేతృత్వంలో 2024 ఎన్నికలను ఎదుర్కోవాలనే అంశమై ఓటర్ల అభిప్రాయాలను సర్వే
నిర్వాహకులు సేకరించారు. 2019 ఎన్నికల్లో బోరిస్ నేతృత్వంలో టోరీలు ఘన విజయం
సాధించారు. అయితే, 2024 ఎన్నికల్లో బ్రిటన్ ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపరని
తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 63శాతం మంది బోరిస్ జాన్సన్‌ను
వ్యతిరేకించారు. 24 శాతం మంది ఆయన అభ్యర్థిత్వానికి సానుకూలత వ్యక్తం చేశారు.
అదే సమయంలో రిషి సునాక్‌కు 43 శాతం మంది మద్దతు తెలిపారు. టోరీ పార్టీ
ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. 19 శాతం మంది మాత్రమే
బోరిస్ పాలన మాదిరిగానే ఉందని పేర్కొన్నారు. ఇక కరోనా ఆంక్షలను ధిక్కరిస్తూ
నిర్వహించిన పార్టీగేట్ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో మాజీ ప్రధాని బోరిస్
జాన్సన్ వాస్తవాలను వెల్లడిస్తారని 14 శాతం మంది చెప్పారు. ప్రధాని రిషి
సునాక్ నిజమే చెబుతారని 38 మంది ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను
సమర్థంగా నిర్వహించే విషయంలో బోరిస్‌పై 19 శాతం మంది, రిషి సునాక్‌పై 44 శాతం
మంది భరోసా ఉంచారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సర్వే నిర్వహించారు.